Begin typing your search above and press return to search.

దివాక‌ర్ రెడ్డి బ‌స్సులు... సీజ్ లు కొనసాగుతూనే ఉన్నాయి!

By:  Tupaki Desk   |   4 March 2020 8:30 AM GMT
దివాక‌ర్ రెడ్డి బ‌స్సులు... సీజ్ లు కొనసాగుతూనే ఉన్నాయి!
X
స్క్రాప్ చేయాల్సిన లారీల‌ను తెచ్చి ఇక్క‌డ తిప్పుతున్న వైనం పై ఇప్ప‌టికే దివాక‌ర్ ట్రావెల్స్ పై ర‌వాణా శాఖ అధికారులు సీజ్ పంజా విసిరారు. భారీ సంఖ్య‌లో దివాక‌ర్ ట్రావెల్స్ లారీల‌ను అధికారులు సీజ్ చేశారు. స్క్రాప్ కు వెళ్లాల్సిన లారీల‌కు న‌కిలీ ప‌త్రాల‌ను సృష్టించి వాటి ద్వారా వ్యాపారం చేస్తున్నారంటూ దివాక‌ర్ ట్రావెల్స్ పై కేసులు కూడా న‌మోదు అయ్యాయి. ఇక బ‌స్సుల సంగ‌తి స‌రేస‌రి!

ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన త‌ర్వాత స‌రైన ప‌ర్మిట్లు లేకుండా న‌డుస్తున్న దివాక‌ర్ రెడ్డి కి చెందిన ట్రావెల్ బ‌స్సులు చాలా వ‌ర‌కూ సీజ్ అయ్యాయి. ఈ విష‌యంలో ఈ టీడీపీ మాజీ ఎంపీ తీవ్రంగా ఆవేద‌న వ్య‌క్తం చేసేశారు. బ‌స్సుల‌న్నాకా కొన్ని కొన్ని ప‌ర్మిట్లు ఉండ‌వ‌ని, అన్ని కరెక్టుగా పెట్టుకుని ఎవ‌రూ ఈ వ్యాపారం చేయ‌లేరంటూ దివాక‌ర్ రెడ్డి స్వ‌యంగా చెప్పుకొచ్చారు. ఒక మాజీ ప్ర‌జాప్ర‌తినిధి అయ్యుండి, ఒక మాజీ మంత్రి అయిన ఆయ‌న అలా మాట్లాడ‌టం విడ్డూరం!

ఇక త‌న ట్రావెల్ బ‌స్సుల‌ను వ‌ర‌స పెట్టి ర‌వాణా శాఖ అధికారులు సీజ్ చేస్తుండే స‌రికి, కొన్నాళ్ల పాటు ఈ వ్యాపారాన్ని ప‌క్క‌న పెడ‌తామంటూ జేసీ ప్ర‌ట‌కించుకున్నారు. అయితే అది ఒట్టి మాట గానే మిగిలిన‌ట్టుగా ఉంది. దివాక‌ర్ ట్రావెల్స్ కు సంబంధించిన మ‌రో రెండు బ‌స్సుల‌ను ఏపీలో సీజ్ చేశారు!

అందులో ఒక‌టి ఏసీ బ‌స్సు కాగా, మ‌రోటి స్థానికంగా తిరిగే బ‌స్సు. వీటిలో ఏసీ వోల్వో బ‌స్సును హైద‌రాబాద్- తాడిప‌త్రి మ‌ధ్య‌న తిప్పుతున్న‌ట్టుగా తెలుస్తోంది. దీనికి స‌రైన ప‌ర్మిట్లు లేవ‌ని అధికారులు సీజ్ చేసిన‌ట్టుగా స‌మాచారం. ఇక మ‌రో బ‌స్సుకు రెంట‌ల్ ప‌ర్మిట్లు తెచ్చుకుని.. దాంట్లో ప్ర‌యాణికుల‌ను త‌ర‌లిస్తున్న‌ట్టుగా అధికారులు గుర్తించారు. దీంతో దాన్ని కూడా సీజ్ చేసిన‌ట్టుగా తెలుస్తోంది. ఇలా జేసీ దివాక‌ర్ రెడ్డికి చెందిన ట్రావెల్స్ బ‌స్సుల సీజ్ ల ప‌రంప‌ర కొన‌సాగుతున్న‌ట్టుగా ఉంది.