Begin typing your search above and press return to search.

డబుల్ బెడ్రూం ఇళ్లకు కాంట్రాక్టర్ల కరవు

By:  Tupaki Desk   |   23 March 2016 5:10 AM GMT
డబుల్ బెడ్రూం ఇళ్లకు కాంట్రాక్టర్ల కరవు
X
ప్రకృతి కన్నెర్రతో కటకటలాడే కరవు చూస్తున్నదే. కానీ.. కాంట్రాక్టర్లు తమ వల్ల కాదంటూ హడలిపోతున్న వైనంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం ఒక కొలిక్కి రావటం లేదు. రానున్న ఏడాది సమయంలో తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల డబుల్ బెడ్రూం ఇళ్లను వాయు వేగంతో నిర్మించాలన్న ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంటే.. కాంట్రాక్టర్ల తీరు మరోలా ఉంది. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి కాంట్రాక్టర్లు సానుకూలంగా లేకపోగా.. ఈ పథకం కింద పనుల్ని తాము చేయలేమని తేల్చి చెబుతున్నట్లుగా అధికారులు తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లటం గమనార్హం.

గృహ నిర్మాణ మంత్రిగా వ్యవహరిస్తున్న ఇంద్రకరణ్ రెడ్డి తాజాగా ఒక సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీనికి హాజరైన అధికారులు.. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రావటం లేదని చెబుతున్నారు. డబుల్ బెడ్రూం నిర్మాణం విషయంలో ప్రభుత్వం పట్టుదలగా ఉండటం.. నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా ఉండటం.. నాలుగు రూపాయిలు మిగిలే అవకాశం లేకపోవటమే కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవటానికి కారణంగా చెబుతున్నారు.

మరోవైపు.. గతంలో నిర్మించిన ఇళ్లకు బిల్లులు చెల్లించని నేపథ్యంలో.. తాజాగా నిర్మించే డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం ఖరీదైనది కావటంతో.. ఏ మాత్రం తేడా వచ్చినా అడ్డంగా బుక్ అయిపోతామన్న ఆలోచనతోనే కాంట్రాక్టర్లు ముందుకు రావటం లేదన్న మాట వినిపిస్తోంది. ఏది ఏమైనా తెలంగాణ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా స్టార్ట్ చేసిన ఒక పథకానికి కాంట్రాక్టర్లు రెఢీగా లేరన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పక తప్పదు.