Begin typing your search above and press return to search.

కాంట్ర‌వ‌ర్స‌ల్ లీడ‌ర్స్ హిట్‌... నిజం!!

By:  Tupaki Desk   |   10 May 2022 2:30 AM GMT
కాంట్ర‌వ‌ర్స‌ల్ లీడ‌ర్స్ హిట్‌... నిజం!!
X
ఆ రంగం.. ఈ రంగం అనే తేడా లేదు.. ఆ దేశం ఈ దేశం అనే తేడా అంత‌క‌న్నాలేదు.. కాంట్ర‌వ‌ర్సీ ఉంటే చాలు.. వారికి ఉండే ఫాలోయింగ్‌.. వారి ఉండే అభిమానుల లెక్కే వేరు. సినీ రంగం నుంచి రాజ‌కీయాల వ‌ర‌కు.. క్రీడాకారుల నుంచి క‌ళాకారుల వ‌ర‌కు.. ఎవ‌రైనా.. స‌రే.. కాంట్ర‌వ‌ర్సీ ఉంటే చాలు.. హిట్ట‌వుతున్నారు.. హీట్ పెంచుతున్నారు! అగ్ర‌రాజ్యం నుంచి అభివృద్ధి చెందుతున్న దేశం వ‌ర‌కు.. కాంట్ర‌వ‌ర్సీ వ్యాఖ్య‌లు చేసే నాయ‌కులంటే ప‌డిచ‌చ్చిపోయే అభిమానులు ఉన్నారంటే.. ఆశ్చ‌ర్యం వేస్తుంది. అప్ప‌ట్లో అగ్ర‌రాజ్యం అధ్య‌క్షుడిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ ఈ కేట‌గిరీలో ముందున్నారు. ఇప్పుడు కూడాఆయ‌న రేంజ్ ఏమీ త‌గ్గ‌లేదు.

క‌రోనా స‌మ‌యమైనా.. మెక్సికో నుంచి అక్ర‌మాల‌ను అరిక‌ట్టే గోడ నిర్మాణంలో అయినా.. ట్రంప్ చేసిన వివాదం.. విప‌రీతం అంతా ఇంతా కాదు. ప్ర‌పంచం మొత్తం మాస్కులో ముఖాన్ని దాచుకుని.. క‌రోనా నుంచి ర‌క్షించుకునే ప్ర‌య‌త్నం చేస్తే.. మాస్కు పెట్ట‌నంటే పెట్ట‌నంటూ.. ట్రంప్ చేసిన బీభ‌త్సం.. ఆయ‌న‌ను ప్ర‌పంచ వ్యాప్త హీరోను చేసింది. చైనాపై దుమ్మెత్తిపోసినా.. క‌రోనాకు టీకానే అవ‌స‌రం లేద‌ని చెప్పినా.. ట్రంప్.. కాంట్ర‌వ‌ర్సీకి కేరాఫ్‌గా మారారు.

ఇక‌, మ‌న దేశానికి వ‌స్తే.. బీజేపీలోని సాధ్వి ప్ర‌జ్యాసింగ్ ఠాగూర్ అయినా.. ఉమా భార‌తి అయినా.. బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ అయినా.. నోరు విప్పారంటే.. వివాదాల వ‌ర్షం.. విమ‌ర్శ‌ల జోరు ఓ రేంజ్‌లో పారుతుంటాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల‌పైనా.. అల‌వోక‌గా విమ‌ర్శ‌లు ఎక్కుపె్ట్ట‌డంలో ఉమాభార‌తిది అందెవేసిన చేయి. ఇక‌, హిందువులు త‌ప్ప ఈ దేశంలో వేరే వారికి స్తాన‌మే లేద‌నే.. ప్ర‌జ్యాసింగ్ శైలే.. వేరు. ఇక‌, మోడీపై ఒంటికాలిపై లేచే.. మ‌మ‌తా బెన‌ర్జీ నోరు విప్పితే.. మాట‌ల తూటాలు పేలుతాయి. ఇవ‌న్నీ.. వివాదాలే అయినా.. వారిని రాజ‌కీయంగా లైమ్‌లైట్ ఉంచేలా చేయ‌డం గ‌మ‌నార్హం

మ‌రోవైపు.. బీజేపీకే చెందిన సుబ్ర‌మ‌ణ్య స్వామి, శివ‌సేన‌కు చెందిన సంజ‌య్ రౌత్ వంటివారు కూడా వివాదాల‌కు కేంద్రంగానే రాజ‌కీయాలు చేస్తున్నారు. కోర్టుల్లో కేసులు వేయ‌డంలోను.. వివాదాస్ప‌ద అంశాల‌పై కామెంట్లు చేయ‌డంలోనూ.. సుబ్ర‌మ‌ణ్య స్వామిని మించిన దిట్ట మ‌రొక‌రు లేరంటే.. అతిశ‌యోక్తి కాదు. ఇక‌, సంజ‌య్ రౌత్ అయితే.. మ‌రింత వేడి పుట్టిస్తారు. ఇటీవ‌ల మ‌సీదుల్లో లౌడ్ స్పీక‌ర్లు తొల‌గించాల్సిన అంశం తెర‌మీదికి వ‌చ్చిన‌ప్పుడు.. మ‌రింత రెచ్చిపోయారు. అవ‌స‌ర‌మైతే.. త‌న‌ను కాల్చి చంపినా.. వెనక్కు త‌గ్గేదిలేద‌న్నారు.

ఇక‌, ఇదే మ‌హారాష్ట్ర‌కు చెందిన స్వతంత్ర నాయ‌కురాలు.. ఎంపీ న‌వ‌నీత్ కౌర్ కూడా ఏమాత్రం వెన‌క్కి త‌గ్గేదేలే.. అన్న‌ట్టుగా కాంట్ర‌వ‌ర్సీకి ఆమె కేరాఫ్‌గా మారారు. ఏకంగా ముఖ్య‌మంత్రి నివాసం ముందే.. హ‌నుమాన్ చాలీసా ప‌ఠిస్తానంటూ.. వ్యాఖ్యానించి.. జైలుకు వెళ్లారు. తిరిగి బెయిల్‌పై వ‌చ్చాక కూడా ఎక్క‌డా వెన‌క్కి త‌గ్గ‌లేదు. ద‌మ్ముంటే.. సీఎం రాజీనామా చేయాలంటూ.. ఉద్ద‌వ్ ఠాక్రేకే స‌వాల్ రువ్వారు. ఇలా.. వీరంతా.. రాజ‌కీయ కాంట్ర‌వ‌ర్సీకి కీల‌క నేత‌లుగా మారారు.

రెండు తెలుగు రాష్ట్రాల విష‌యానికి వ‌స్తే.. ఏపీలో మాజీ మంత్రి కొడాలి నాని, పేర్ని నాని, రోజా, బొండా ఉమా.. ఇలా.. చాలా మంది నాయ‌కులు, నాయ‌కురాళ్లు.. వివాదాల్లో మునిగి తేలుతున్నారు. ఇక్క‌డ వీరి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు ఎలా ఉన్నా.. వీరి వ్యాఖ్య‌ల‌కు నెటిజ‌న్లు ఫాలో అవుతుండ‌డం, టీవీ చానెళ్ల రేటింగులు పెరిగిపోతుండ‌డం వీరిని లైమ్‌లైట్‌లో ఉంచింద‌నే చెప్పాలి. ఇక‌, సినీ రంగాన్ని తీసుకుంటే.. బాలీవుడ్‌లో కంగ‌నా ర‌నౌత్ పేరు మార్మోగుతుంది.

కాంట్ర‌వ‌ర్సీ వ్యాఖ్య‌లు, ట్విట్ట‌ర్ రాత‌లు.. ఆమెను మీడియాలో ముందు నిలిపాయి. మోడీపైనా.. గ‌త స్వాతంత్ర స‌మ‌రంపైనా.. ప్ర‌స్తుత వ‌ర్త‌మాన రాజ‌కీయాల‌పైనా.. ర‌నౌత్ త‌న వివాదాల‌తో ఒక విధ్వంస‌మే సృష్టించారు. అదేవిధంగా విశ్వ‌క్సేన్‌, శ్రీరెడ్డి, బండ్ల గ‌ణేష్ వంటివారు కూడా కాంట్ర‌వ‌ర్సీల‌తోనే మీడియాలో నిలుస్తుండ‌డం గ‌మ‌నార్హం. మొత్తంగా వీరు ఎంచుకునే విష‌యాలు ఏవైనా.. కాంట్ర‌వ‌ర్సీనే కీల‌కం. అదేవారిని హీరోలుగా మీడియాలో నిల‌బెడుతోందనేదీ వాస్త‌వం.