Begin typing your search above and press return to search.

తిరుమ‌ల‌లో వివాదాస్ప‌దంగా ఆ మ‌హిళా మంత్రి తీరు!

By:  Tupaki Desk   |   15 Aug 2022 8:30 AM GMT
తిరుమ‌ల‌లో వివాదాస్ప‌దంగా ఆ మ‌హిళా మంత్రి తీరు!
X
తిరుమ‌ల ఇప్పుడు భ‌క్తుల‌తో కిట‌కిట‌లాడుతోంది. ఆగ‌స్టు 12 నుంచి 15 వ‌రుస‌గా నాలుగు రోజులు సెల‌వులు రావ‌డంతో అంతా తిరుమ‌ల‌కు పోటెత్తారు. స‌ర్వ ద‌ర్శ‌నానికి ఏకంగా 40 గంట‌ల స‌మ‌యం ప‌డుతోంది. ప్ర‌త్యేక ద‌ర్శనానికి కూడా ఏడెనిమిది గంట‌ల స‌మయం ప‌డుతోంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నాల‌ను వీకెండ్స్‌తోపాటు సెల‌వు దినాల్లో ర‌ద్దు చేసింది.

రికార్డు స్థాయిలో భక్తుల రద్దీ కొనసాగుతుండ‌టంతో వైకుంఠంలోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శ్రీవారి సేవా సదన్ మీదుగా రింగ్ రోడ్డులోని ఆక్టోపస్ బిల్డింగ్ వరకు భక్తులు వేచి ఉన్నార‌ని తెలుస్తోంది.

అయితే మ‌హిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉష‌శ్రీ చ‌ర‌ణ్ తీరు మాత్రం వివాదాస్ప‌దంగా ఉంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఆగ‌స్టు 15న తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్న ఆమె 50 మంది అనుచ‌రుల‌తో శ్రీవారిని ద‌ర్శ‌నం చేసుకున్నార‌ని విమ‌ర్శ‌లు రేగుతున్నాయి.

అలాగే మ‌రో ప‌ది మందికి సుప్ర‌భాత‌ సేవా టికెట్లు కూడా ఇప్పించార‌ని ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. తాము రోజుల త‌ర‌బ‌డి ద‌ర్శ‌నానికి నిరీక్షిస్తుంటే మంత్రితోపాటు ఆమె అనుచ‌రుల‌కు కూడా వీఐపీ ద‌ర్శ‌నం ఇప్పించ‌డంపై భ‌క్తులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

మంత్రి ఉషశ్రీ చరణ్ ఒత్తిడికి తలొగ్గి టీటీడీ టికెట్లను జారీచేసిందనే మండిప‌డుతున్నారు. వీఐపీల‌ను, సెల‌బ్రిటీల‌ను ప‌ట్టించుకున్న‌ టీటీడీ సాధారణ భక్తుల కష్టాలను పట్టించుకోవడం లేదని భక్తులు మండిపడుతున్నారు.

మ‌రోవైపు ఈ వ్య‌వ‌హారాన్ని చిత్రీక‌రించ‌బోయిన మీడియా ప్ర‌తినిధుల‌పై మంత్రి ఉష‌శ్రీ గ‌న్‌మెన్లు దాడికి దిగార‌ని స‌మాచారం. ఒక వీడియో జ‌ర్న‌లిస్టును నెట్టేయ‌డంతోపాటు మీడియా ప్ర‌తినిధుల‌పై దురుసుగా ప్ర‌వ‌ర్తించారని ఆరోపిస్తున్నారు.