Begin typing your search above and press return to search.

హిందువుగా ఉన్నంత‌వ‌ర‌కు నువ్వు అంట‌రానివాడివే: ఎంపీ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు!

By:  Tupaki Desk   |   14 Sep 2022 10:34 AM GMT
హిందువుగా ఉన్నంత‌వ‌ర‌కు నువ్వు అంట‌రానివాడివే:  ఎంపీ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు!
X
త‌మిళ‌నాడు అధికార పార్టీ డీఎంకే ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి ఏ రాజా చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు కాక‌రేపాయి. తమిళనాడులోని నమక్కల్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాజా హిందూ మతంలో కుల వ్యవస్థ గురించి చేసిన ఆ రాష్ట్ర రాజ‌కీయాల్లో మంట పుట్టించారు.

నువ్వు హిందువుగా ఉన్నంత వరకు నువ్వు శూద్రునిగానే ఉంటావు. శూద్రునిగా ఉన్నంత వరకు నువ్వు వ్యభిచారి కొడుకువి. నువ్వు హిందువుగా ఉన్నంత వరకు నువ్వు దళితుడివి. హిందువుగా ఉన్నంత వరకు నువ్వు అంటరానివాడివి అని మాట్లాడిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

అలాగే ఆయ‌న అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టును కూడా విమ‌ర్శిస్తూ వ్యాఖ్య‌లు చేశారు.నువ్వు క్రైస్తవుడివి/ముస్లింవి/పర్షియన్‌వి కాకపోతే నువ్వు తప్పనిసరిగా హిందువువే అయ్యి ఉండాల‌ని సుప్రీంకోర్టు చెప్తోందని మండిప‌డ్డారు. ఇలాంటి దురాగతం మరే దేశంలోనైనా ఉందా? అని ఎంపీ రాజా ప్రశ్నించారు. సనాతన ధర్మాన్ని సవాల్ చేయాల‌ని, కుల వ్యవస్థ గురించి గళమెత్తాలని, ప్రశ్నించాలని ప్రజలకు రాజా పిలుపు నివ్వ‌డం గ‌మ‌నార్హం.

పెరియార్ ఈవీ రామస్వామి నాయ‌క‌ర్.. ద్రవిడార్ కళగం సాంఘికోద్యమాన్ని ప్రారంభించార‌ని డీఎంకే ఎంపీ రాజా చెప్పారు. కుల వ్యవస్థ, అంటరానితనం వంటి జాఢ్యాలను నిర్మూలించడం ఈ ఉద్యమం లక్ష్యమ‌న్నారు. వ్యభిచారి కొడుకులుగా ఎందరు ఉండాలని, అంటరానివారిగా ఎందరు ఉండాలని గట్టిగా ప్రశ్నించిన‌ప్పుడే సనాతన ధర్మం కూకటి వేళ్ళతో కూలిపోతుందని తెలిపారు.

తమిళనాడు అధికార పార్టీ డీఎంకే ఎంపీ ఏ రాజా హిందూ మతంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదం రేపాయి. ఈ వ్యాఖ్యలతో కూడిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డం బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు కే. అణ్ణామలై.. ఏ.రాజాపై తీవ్రంగా మండిప‌డ్డారు. రాజా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రాజా ల‌క్ష్యం హిందూ మ‌తాన్ని కించ‌ప‌రిచి ఇతర మతాలవారిని తమ వైపు తిప్పుకోవడమేనని ధ్వ‌జ‌మెత్తారు.

కాగా రాజాకు వివాదాలు కొత్తేమీ కాదు. డీఎంకే అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి క‌రుణానిధికి అత్యంత సన్నిహితుడైన రాజా యూపీఏ ప్ర‌భుత్వ హ‌యాంలో కేంద్ర మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. గతంలో ఆయనపై 2G స్పెక్ట్రమ్ కుంభకోణం కేసు విచారణ జరిగింది. టెలికామ్ సంస్థ‌ల‌కు నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా 2జీ స్ప్రెక్ట‌మ్ కేటాయించార‌నే ఆరోప‌ణ‌లు ఆయ‌న‌పై ఉన్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.