Begin typing your search above and press return to search.

ఈ తెలుగుకు తెగులు ప‌ట్టింది చూడు కేసీఆర్‌

By:  Tupaki Desk   |   13 Dec 2017 11:14 AM GMT
ఈ తెలుగుకు తెగులు ప‌ట్టింది చూడు కేసీఆర్‌
X
మ‌రో రెండు రోజుల్లో ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌లు జ‌రుగుతున్నాయి. ఈ స‌భ‌ల కోసం భారీ ఎత్తున కార్య‌క్ర‌మాల్ని చేప‌ట్టారు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌. అమ్మ భాష‌కు మ‌రింత ప్రాధాన్య‌త పెరిగేలా.. ఇప్ప‌టివ‌ర‌కూ ఎప్పుడూ జ‌ర‌గ‌నంత భారీగా తెలుగు మ‌హాస‌భ‌ల్ని నిర్వ‌హించాల‌ని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు.

ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత నిర్వ‌హిస్తున్న తొలి ప్ర‌పంచ తెలుగు మ‌హా స‌భ‌లు కావ‌టంతో కోట్లాది రూపాయిలు ఖ‌ర్చుకు వెన‌కాడ‌కుండా అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా స‌భ‌ల్ని నిర్వ‌హిస్తున్నారు. ఇదంతా బాగానే ఉన్నా.. మ‌హా స‌భ‌ల కోసం చేస్తున్న ఏర్పాట్లు తూతూ మంత్రంగా సాగుతున్న వైనంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

చివ‌ర‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ పేరును రాసే విష‌యంలోనూ దొర్లుతున్న నిర్ల‌క్ష్యంపై ప‌లువురు ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

మ‌హా స‌భ‌ల‌కు ప్ర‌ధాన వేదిక అయిన ఎల్బీ స్టేడియం వ‌ద్ద ఏర్పాటు చేసిన ముఖ్య‌మంత్రి ఫ్లెక్సీలో భాషా దోషాలు ఉండ‌టంపై ప‌లువురు ముక్కున వేలేసుకుంటున్నారు. ప్ర‌ధాన వేదిక ద‌గ్గ‌ర ఏర్పాటు చేసిన సీఎం ఫ్లెక్సీలో కేసీఆర్ పేరు కింద ఉన్న ఆయ‌న హోదా ఒక ప‌ట్టాన అర్థం కానిదిగా మారింది. అందులో హాబీబ్లీ అని రాసుంది. అచ్చ తెలుగు అక్ష‌రాల్లో ఉన్న దీని అర్థం ఎంత‌కూ అర్థం కాక త‌ల బ‌ద్ధ‌లు కొట్టుకునే ప‌రిస్థితి.

ఇంత‌కీ జ‌రిగిందేమంటే ఫ్లెక్సీ త‌యారు చేయించిన మ‌హానుభావుడు ఇంగ్లిషులో ఉన్న ‘Hon'ble Chief Minister of Telangana అన్న ప‌దాన్ని య‌థాత‌ధంగా గుగూల్ లో ట్రాన్స్ లేట్ చేయ‌టం వ‌ల్ల దొర్లిన త‌ప్పుగా చెప్పాలి. నిజానికి హాన‌ర్ బుల్ చీఫ్ మినిస్ట‌ర్ అనే దాని కంటే తేట తెలుగులో తెలంగాణ రాష్ట్ర గౌర‌వ ముఖ్య‌మంత్రి అని రాసే దానికి బ‌దులు హ‌డావుడిలో ఏదో ఒక‌టి రాసేద్దామ‌న్న‌ట్లుగా రాసేసిన‌ట్లుగా క‌నిపిస్తోంది.

మిగిలిన సంద‌ర్భాల్లో ఇలాంటి త‌ప్పుల్ని చూసి చూడ‌న‌ట్లు వ‌దిలేసే ప‌రిస్థితి. కానీ ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల కార్య‌క్ర‌మం.. అందునా ప్ర‌ధాన వేదిక వ‌ద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఇంత ముద్రారాక్ష‌సం ఉండ‌టం అంటే ఎవ‌రికి చెప్పాలి. అందుకే.. ఇలాంటి త‌ప్పుల్ని గౌర‌వ‌నీయ ముఖ్య‌మంత్రుల వారే స్పందిస్తే బాగుంటుంద‌న్న అభిప్రాయం ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు.