Begin typing your search above and press return to search.

మ‌ళ్లీ మొద‌టికొచ్చిన ఆ వివాదాస్ప‌ద ఐపీఎస్ కేసు!

By:  Tupaki Desk   |   19 Aug 2022 6:31 AM GMT
మ‌ళ్లీ మొద‌టికొచ్చిన ఆ వివాదాస్ప‌ద ఐపీఎస్ కేసు!
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావును క‌ష్టాలు వీడ‌టం లేదు. వైఎస్ జ‌గ‌న్ ప్రభుత్వం అధికారంలోకి వ‌చ్చాక దాదాపు రెండేళ్ల‌కుపైగా ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు స‌స్పెన్ష‌న్ కు గుర‌యిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో సుప్రీంకోర్టు తీర్పు మేర‌కు ఇటీవ‌ల ప్రింటింగ్‌, స్టేషనరీ, స్టోర్స్‌ విభాగం క‌మిషనర్‌గా ఎట్ట‌కేల‌కు ఆయ‌న మ‌ళ్లీ ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. అయితే ఇంత‌లోనే ఆయనపై గతంలో క్రిమినల్‌ కేసు నమోదై ఉండటంతో అఖిల భారత సర్వీసు నిబంధనల ప్రకారం సస్పెండ్‌ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ జూన్ 28న‌ ఉత్తర్వులు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే.

హైకోర్టు ఆదేశాల మేరకు సస్పెన్షన్‌ కాలానికి రాష్ట్ర ప్రభుత్వం తనకు జీతభత్యాలు ఇవ్వాల్సిఉండగా అవి చెల్లించలేదంటూ తాజాగా ఏబీ వెంకటేశ్వరరావు హైకోర్టులో కోర్టుధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేశారు. ఉద్దేశపూర్వకంగా కోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు ఏపీ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి (సీఎస్‌) సమీర్‌ శర్మను శిక్షించాలని కోరారు.

ఈ నేప‌థ్యంలో ప్రతివాదిగా ఉన్న సీఎస్‌ సమీర్‌ శర్మకు హైకోర్టు నోటీసు జారీచేసింది. కౌంటరు దాఖలు చేయడానికి సమయం కావాలని హోంశాఖ జీపీ మహేశ్వరరెడ్డి కోరడంతో త‌దుప‌రి విచారణను సెప్టెంబరు 15కు వాయిదా వేసింది.

కాగా టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో నిఘా పరికరాల కొనుగోలు వ్యవహారంలో ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2020 ఫిబ్రవరి 8న జీవో జారీ చేసింది. దానిపై జోక్యం చేసుకోవడానికి కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్‌ (క్యాట్‌) నిరాకరించింది.

దీంతో ఏబీ వెంకటేశ్వరరావు హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఆయన సస్పెన్షన్‌ చట్టవిరుద్ధమంటూ.. సంబంధిత జీవోను కొట్టివేస్తూ హైకోర్టు 2020 మే 22న తీర్పు ఇచ్చింది. ఏబీ వెంకటేశ్వ‌ర‌రావుకు ఇవ్వాల్సిన అన్ని ఆర్థిక ప్రయోజనాలను కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

అయితే హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెష‌ల్ లీవ్ పిటిష‌న్ (ఎస్‌పీఎల్‌) దాఖ‌లు చేసింది. దాన్ని సుప్రీంకోర్టు ఈ ఏడాది ఏప్రిల్‌ 22న కొట్టేసింది. ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం 2022 ఏప్రిల్‌ 22 నుంచి పూర్తిస్థాయి జీతభత్యాలు చెల్లించడం ప్రారంభించింది. హైకోర్టు ఆదేశించిన ప్రకారం సస్పెన్షన్‌ కాలానికి కూడా తనకు రావాల్సిన జీతభత్యాలు ఇవ్వాలని ఏబీ వెంకటేశ్వరరావు తాజాగా హైకోర్టులో కోర్టుధిక్కరణ పిటిష‌న్ వేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు జీతభత్యాలు ఇవ్వాలని ప్ర‌భుత్వ కార్య‌ద‌ర్శికి లేఖలు రాసినా స్పందించ‌డం లేద‌ని కోర్టు దృష్టికి తెచ్చారు.