Begin typing your search above and press return to search.

మోడీకి మహిళలతో షాక్ ఇస్తాడట..

By:  Tupaki Desk   |   10 Jun 2018 7:48 AM GMT
మోడీకి మహిళలతో షాక్ ఇస్తాడట..
X
సంచలనాలకు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన రిటైర్డ్ జస్టిస్ కర్ణన్ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. ఇదివరకు న్యాయవ్యవస్థలో కోల్ కతా ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు కర్ణన్ తీవ్ర నిర్ణయాలు తీసుకున్నారు.. ఆయన తీసుకున్న అసంబద్ధ నిర్ణయాలపై సుప్రీం కోర్టు స్టే విధించింది. అయితే తన శిక్షలను సుప్రీం అడ్డుకోవడం పై ఫైర్ అయిన కర్ణన్ ఏకంగా సుప్రీం కోర్టు న్యాయమూర్తులనే అరెస్ట్ చేయాలని ఆదేశించడం అప్పట్లో పెను సంచలనమైంది. దీంతో కలుగజేసుకున్న అత్యున్నత న్యాయస్థానం కర్ణన్ కు కోర్టు ధిక్కారం కింద ఆరునెలల జైలు శిక్ష విధించింది. అంతేకాదు అతడికి ఎయిమ్స్ కు తీసుకెళ్లి వైద్యపరీక్షలు చేయాలని ఆదేశించింది. ఇలా ఎంతో రచ్చ చేసి న్యాయ వ్యవస్థకే మచ్చ తెచ్చిన కర్ణన్ తాజాగా మరో సంచలన ప్రకటనతో తెరమీదకు వచ్చారు.

చెన్నైలోని అంబేద్కర్ మెమోరియల్ హౌస్ వేదికగా శుక్రవారం జరిగిన సభలో పాల్గొన్న కర్ణన్ తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించారు. అంతేకాదు.. ‘ఊఝాలుక్కా ఎదిరానా సెయాలక్కా కట్చి(యాంటీ కరప్షన్ డైనమిక్ పార్టీ) అనే పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవ్యవస్థ సహా అన్ని శాఖల్లో అవినీతిని రూపుమాపడమే తమ ముందున్న ప్రధాన కర్తవ్యవమని చెప్పారు. ‘అవినీతి రహిత దేశం కోసమే తమ పార్టీ పోరాటమని’ తెలిపారు. అంతేకాదు వచ్చే లోక్ సభ ఎన్నికల్లో దేశంలోని మొత్తం 543 స్థానాల్లో పోటీ చేస్తామని.. అన్నింటా మహిళలనే బరిలోకి దించుతామని ప్రకటించి సంచలనం సృష్టించారు. దేశ రాజకీయ వ్యవస్థలో మహిళలపై వివక్ష కొనసాగుతోందని.. దీన్ని తాము సరిచేస్తామని తెలిపారు.

అంతేకాదు.. వారణాసి లోక్ సభ స్థానం నుంచి పోటీచేయాలని పార్టీ జనరల్ బాడీ తనను కోరిందని కర్ణన్ బాంబు పేల్చారు. ప్రస్తుతం వారణాసి నుంచి ప్రధాని మోడీ పోటీచేస్తున్నారు. ఆయనకు పోటీగా నిలబెడతానని చెప్పి కర్ణన్ సంచలనం సృష్టించారు. దేశమంతా మహిళలనే బరిలో ఉంచుతామని కర్ణన్ ప్రకటించడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.