Begin typing your search above and press return to search.

ముదురుతున్న 'మఠం' వివాదం ..శివస్వామి మాటల వెనుక ఎవరున్నారు , మఠాధిపతి ఎవరు ?

By:  Tupaki Desk   |   15 Jun 2021 4:00 AM GMT
ముదురుతున్న మఠం వివాదం ..శివస్వామి మాటల వెనుక ఎవరున్నారు , మఠాధిపతి ఎవరు ?
X
కాలజ్ఞానం రచయితగా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సజీవ సమాధిగా మారిన పుణ్యక్షేత్రం ప్రస్తుతం వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. బ్రహ్మంగారిమఠం పీఠాధిపతిగా ఉన్న వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి ఇటీవల శివైక్యం పొందారు. దీంతో తమకే మఠాధిపతి పదవి దక్కాలని ఆయన ఇద్దరు భార్యల కుమారుల మధ్య వివాదం నెలకొంది. పెద్ద భార్య కుమారుడినే మఠాధిపతిగా నియమించాలని ఓ వర్గం.. వీలునామా ప్రకారం రెండో భార్య కుమారుడికే అవకాశం కల్పించాలని మరోవర్గం నడుమ వివాదం నడుస్తోంది.

వసంత వెంకటేశ్వర స్వామి పెద్ద భార్య చంద్రావతికి నలుగురు కొడుకులు, నలుగురు కూతుళ్లు సంతానం. పదేళ్ల కిందట చంద్రావతి మరణించడంతో ఆయన రెండో వివాహం చేసుకున్నారు. రెండో భార్యకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. తండ్రి మరణంతో వారసత్వ వివాదం తలెత్తింది. ఆయన పెద్ద భార్య పెద్ద కుమారుడు వెంకటాద్రి స్వామిని మఠాధిపతి గా నియమించాలని ఆ వర్గం కోరుతుంది. కానీ చనిపోయే ముందు ఆయన వీలునామా రాశారని, దాని ప్రకారం తన కుమారుడికే పదవి దక్కాలని రెండో భార్య వర్గం వాదిస్తోంది. ఇరువర్గాల ఆధిపత్య పోరు కారణంగా కొద్దిరోజులుగా బ్రహ్మంగారిమఠంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ వ్యవహారంలో దేవదాయ శాఖ ఆచితూచి వ్యవహరిస్తోంది. మఠాధిపతులు, భక్తులతో కమిటీ ఏర్పాటు చేసి, చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెబుతోంది. అప్పటి వరకూ దేవదాయ శాఖ కడప జిల్లా అసిస్టెంట్ కమిషనర్‌ ను ఇన్‌ చార్జిగా నియమించింది.

అయితే, ఇటీవల బ్రహ్మంగారిమఠంను సందర్శించిన గుంటూరు జిల్లా తాళ్లాయపాలెం శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారాయి. పెద్ద భార్య కుమారుడికే వారసత్వం దక్కుతుందని ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని మరింత పెంచాయి. రెండో వర్గం పెద్దఎత్తున మండిపడుతోంది. వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి రెండో భార్య శివస్వామిపై తీవ్రమైన ఆరోపణుల చేస్తున్నారు. రూ. యాభై లక్షలు లంచం తీసుకుని ఆయన తమపై కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. వెంకటాద్రిస్వామికి పీఠం కట్టబెట్టేందుకు పీఠాధిపతులు రూ.50 లక్షలు తీసుకున్నట్లు తెలిసిందని, చర్చలకు పిలిచి శివస్వామి అవమానించారని శివస్వామి పై చర్యలకు చట్టపరంగా ముందుకెళ్తామని ప్రకటించారు. ఆమె శివస్వామి మాట్లాడిన ఓ ఆడియోటేపును డీజీపీకి ఇచ్చి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం కూడా ఆయన వ్యాఖ్యలపై స్పందించింది. వీలునామా చట్ట ప్రకారం 90 రోజుల్లోగా ధార్మిక పరిషత్‌ కు చేరాలని దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. బ్రహ్మంగారిమఠం తరహా మఠాధిపతులతో కమిటీ ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. వారసత్వ వివాదంతో మఠం ఖ్యాతి మసకబారుతోందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి త్వరగా ఓ ముగింపు పలకాలని అన్నారు.