Begin typing your search above and press return to search.

మాతృభాష‌పై వివాదాస్ప‌ద ఆదేశం.. భ‌గ్గుమ‌న్న కేర‌ళ‌.. కేటీఆర్ మ‌ద్ద‌తు

By:  Tupaki Desk   |   6 Jun 2021 3:30 PM GMT
మాతృభాష‌పై వివాదాస్ప‌ద ఆదేశం.. భ‌గ్గుమ‌న్న కేర‌ళ‌.. కేటీఆర్ మ‌ద్ద‌తు
X
ద‌క్షిణాది భాష‌ల‌పై ఉత్త‌రాది హిందీ ఆధిప‌త్యం చెలాయించేందుకు ప్ర‌య‌త్నిస్తోంద‌నే విమ‌ర్శ‌లు ద‌శాబ్దాల క్రితం నుంచే ఉన్నాయి. దీనికి వ్య‌తిరేకంగా త‌మిళ‌నాట పెద్ద పోరాట‌మే సాగింది. అయితే.. తాజాగా మ‌రోసారి ఇదే విధ‌మైన ఘ‌ట‌న చోటు చేసుకోవ‌డం గ‌మ‌నార్హం. కేర‌ళ రాష్ట్రానికి చెందిన న‌ర్సులు త‌మ మాతృభాష మ‌ల‌యాళంలో మాట్లాడొద్దంటూ.. ఢిల్లీలోని ప్ర‌భుత్వ ఆసుప‌త్రి ఆదేశాలు జారీచేయ‌డం తీవ్ర వివాదాస్ప‌దంగా మారింది.

ఢిల్లీలోని గోవింద్ బ‌ల్ల‌బ్ పంత్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేష‌న్ మెడిక‌ల్ ఎడ్యుకేష‌న్ అండ్ రీసెర్చ్ ఈ ఆదేశాలు జారీచేసింది. వారు హిందీలో లేదా ఇంగ్లీషులోనే మాట్లాడాలంటూ ఉత్త‌ర్వులు ఇచ్చింది. ఆసుప‌త్రిలో మాతృభాష మాట్లాడొద్ద‌ని ఆదేశించింది. దీంతో.. తీవ్ర ఆగ్ర‌హావేశాలు వ్య‌క్త‌మ‌య్యాయి. ఈ నిర్ణ‌యంపై కేర‌ళ రాష్ట్రం భ‌గ్గుమ‌న్న‌ది.

న‌ర్సుల‌కు ఇలాంటి ఆదేశాలివ్వ‌డం స‌రికాద‌ని బీజీ పంత్ న‌ర్సెస్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు లీలాధ‌ర్ రామచందాని ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. మాజీ కేంద్ర‌మంత్రి, ఎంపీ శ‌శిథ‌రూర్ సైతం మండిప‌డ్డారు. ప్ర‌జాస్వామ్య దేశంలో మాతృభాష‌లో మాట్లాడొద్ద‌ని ఆదేశాలు ఇవ్వ‌డ‌మేంట‌ని ప్ర‌శ్నించారు. ఇది ప్రాథ‌మిక హ‌క్కుల ఉల్లంఘ‌నేన‌ని అన్నారు.

ఈ అంశంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు. కేర‌ళ న‌ర్సుల సేవ‌ల‌ను దేశం మాత్ర‌మే కాకుండా.. ప్ర‌పంచం కూడా వినియోగించుకుంటోంద‌ని గుర్తు చేశారు. అలాంటి వారిని మాతృభాష‌లో మాట్లాడొద్ద‌ని ఆదేశాలు ఇవ్వ‌డంలో అర్థం లేద‌ని అన్నారు. దేశంలో 22 అధికారిక భాష‌లు ఉన్నాయ‌న్న కేటీఆర్‌.. ప్ర‌జ‌లు త‌మ‌కు న‌చ్చిన భాష‌లో, మాతృభాష‌లో మాట్లాడుకునే అధికారం రాజ్యాంగ‌మే ఇచ్చింద‌న్నారు. అలాంటిది ఆసుప‌త్రి అధికారులు అడ్డుకోవ‌డ‌మేంట‌ని ట్విట‌ర్ వేదిక‌గా నిల‌దీశారు.

అన్ని వైపుల నుంచి విమ‌ర్శ‌లు రావ‌డంతో ఢిల్లీ ఆసుప‌త్రి దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఆ ఉత్త‌ర్వులను వెంట‌నే ఉప‌సంహ‌రించుకున్న‌ట్టు ప్ర‌క‌టించింది. ఆ స‌ర్క్యుల‌ర్ త‌మ‌కు తెలియ‌కుండా జారీ అయ్యింద‌ని ఇనిస్టిట్యూట్ ప‌రిపాల‌నా విభాగం చెప్ప‌డం గ‌మ‌నార్హం.