Begin typing your search above and press return to search.

మహిళ‌మంత్రి వ‌ర్సెస్ టీడీపీ సీనియ‌ర్

By:  Tupaki Desk   |   29 March 2018 8:18 AM GMT
మహిళ‌మంత్రి వ‌ర్సెస్ టీడీపీ సీనియ‌ర్
X
ఇప్ప‌టికే ఓ వైపు విప‌క్షాల దాడి - కేంద్రం స‌హాయ నిరాక‌ర‌ణ‌ - పార్టీగా బీజేపీ ఎదురుదాడి వంటి స‌మ‌స్ల‌య‌తో ఇర‌కాటంలో ప‌డిపోయిన ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడ‌కు కొత్త స‌మ‌స్య వ‌చ్చింది. ఏకంగా మంత్రి స్థాయిలో ఉన్న వ్య‌క్తి కేంద్రంగా సాగుతున్న అంతర్గ‌త వార్ టీడీపీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. క‌ర్నూలు జిల్లాకు చెందిన మంత్రి అఖిల‌ప్రియా - ఆర్‌ ఐసీ మాజీ చైర్మన్ ఏవీ సుబ్బారెడ్డి మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నేంతగా ప‌రిస్థితి మారింది. సుబ్బారెడ్డిని మంత్రి టార్గెట్‌గా చేసుకోవ‌గా...త‌న రాజ‌కీయ స‌త్తా చాటేందుకు ప్ర‌త్యేక శిబిరాలు పెడుతున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. చిత్రంగా ఇందుకు హెల్ప్ లైన్ ఏర్పాటు కార‌ణ‌మైంది.

ఆళ్లగడ్డ నియోజకవర్గం పరిధిలో తెలుగుదేశం పార్టీలో వర్గ విబేధాలు తారాస్థాయికి చేరి మూడు గ్రూపులుగా మారిన విషయమై విధితమే. టీడీపీ త‌ర‌ఫున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి అఖిల ప్రియ ఒక వైపు - ఆమెకు పోటీగా బరిలో నిలిచేందుకు పావులు కదుపుతున్న ఏవీ మరో వైపు మోహరించగా గత కొంతకాలంగా టీడీపీనే నమ్ముకుని పనిచేస్తున్న ఇరిగెల వర్గం మరోవైపు పొంచి ఉంది. భూమానాగిరెడ్డి ఉన్న రోజుల్లో కుడి - ఎడమలై ఆళ్లగడ్డ - నంద్యాల నియోజకవర్గాల్లో భూమా అంటే ఏవీ - ఏవీ అంటే భూమా అన్న రీతిలో ఒక్క కుటుంబంలా తిరిగారు ఏవీ సుబ్బారెడ్డి. అయితే భూమా మరణించిన సంవత్సరంలోనే ఆ స్నేహ సంబంధాలు - ఆ కుటుంబ బాంధవ్యాలు మరచిపోయి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం అటు ఆళ్లగడ్డ - నంద్యాల నియోజకవర్గాల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారింది.

తాజాగా మంత్రి భూమా అఖిలప్రియకు ఏవీ సుబ్బారెడ్డి మధ్య రాజకీయ విబేధాలు తారాస్థాయికి చేరడం, తన సత్తా ఏంటో చూపాలని ఏవీ నిర్ణయించడంతో ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని ఇదే చర్చ జరుగుతోంది. 2017వ సంవత్సరం డిసెంబర్ 31వ తేదీ ఏవీ సుబ్బారెడ్డి ఆళ్లగడ్డలో తన బలం నిరూపించుకునేందుకు వీడ్కోలు విందును ఏర్పాటు చేయగా అనూహ్యంగా అంచనాలకు మించి 8 వేల మందికి పైగా ఏవీ అనుచరులు - శ్రేయోభిలాషులు హాజరవడంతో ఆయన దృష్టి ఆళ్లగడ్డ నియోజకవర్గం వైపు మళ్లింది. అలాగే ఈ నెల 11వ తేదీ ఆళ్లగడ్డలో జరిగిన దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి తొలి వర్ధంతి సభకు ఆయనను ముఖ్య అనుచరుడుగా ముద్రపడిన ఏవీ సుబ్బారెడ్డి హాజరుకాకపోవడం, అదేసభలో మంత్రి అఖిల ఏవీ వ్యవహార శైలిపై ధ్వజమెత్తడం - నోట్లకు - మందుకు భూమా అనుచరులు లొంగరని ధీమా వ్యక్తం చేయడంతో ఏవీలో పట్టుదల మరింత పెరిగింది. నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల సమయంలో కొందరు తనను ఏడిపించేందుకు ప్రయత్నించారని ఆమె వ్యాఖ్యానించారు.

2019 సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ఏవీకి అటు నంద్యాలలోను, ఇటు ఆళ్లగడ్డలోను తెలుగుదేశం పార్టీలో ఉంటూ మంత్రికి చెక్ పెట్టే అవకాశాన్ని పసిగట్టిన ఏవీ ఆళ్లగడ్డ నియోజకవర్గంలోనే తాడో - పేడో తేల్చుకోవాలని నిర్ణయించుకున్న అనంతరం గురువారం తెలుగుదేశంపార్టీ 37వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆళ్లగడ్డలో తన పార్టీ కార్యాలయం ఏర్పాటుతోపాటు ఏపీ హెల్ప్‌ లైన్‌ ను కూడా ఆవిష్కరించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. అయితే ఈ హెల్ప్‌ లైన్ ప్రారంభ కార్యక్రమానికి వెళ్ళకూడదని మంత్రి అఖిలప్రియ తన అనుచరులకు సమాచారం ఇచ్చారని ప్రచారం సాగుతోంది. అంతేకాదు ఏవీ నిర్వహించే కార్యక్రమాలకు దూరంగా ఉండాలంటూ మంత్రి నుండి టిడిపి కార్యకర్తలకు ఆదేశాలు వెళ్ళాయంటున్నారు. ఈ కారణంగానే ఏవీ సుబ్బారెడ్డి - భూమా అఖిలప్రియ వర్గాల మధ్య మరోసారి ఆధిపత్య పోరు తెరమీదికి వచ్చింది. తాజాగా ఈ రెండు వ‌ర్గాల మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నేలా ప‌రిస్థితి మారింది.