Begin typing your search above and press return to search.

అసెంబ్లీలో రచ్చరచ్చ:డిప్యూటీ స్పీకర్ ను చెప్పుతో కొట్టి.. జుట్టు పట్టి ఈడ్చిన ఎమ్మెల్యేలు

By:  Tupaki Desk   |   16 April 2022 1:56 PM GMT
అసెంబ్లీలో రచ్చరచ్చ:డిప్యూటీ స్పీకర్ ను చెప్పుతో కొట్టి.. జుట్టు పట్టి ఈడ్చిన ఎమ్మెల్యేలు
X
వాళ్లు ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు.. కానీ ఆ స్థాయి మరిచిపోయారు. డిప్యూటీ స్పీకర్ ను చెప్పుతో కొట్టారు. అంతటితో ఆగకుండా జుట్టు పట్టి ఈడ్చేశారు. ఇదంతా జరిగింది ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి అసెంబ్లీలో.. జరిగింది మాత్రం మన దేశంలో కాదు.. పక్కనున్న పాకిస్తాన్ లో.. పాక్ లోని పంజాబ్ అసెంబ్లీలో సభ్యులు గందరగోళం సృష్టించారు. దీంతో కొత్త సీఎంను ఎన్నుకునేందుకు ఏర్పాటైన సభ రణరంగంగా మారింది. సమావేశానికి అధ్యక్షత వహించేందుకు వచ్చిన డిప్యూటీ స్పీకర్ దోస్త్ మహ్మద్ మంజారీపై పాకిస్తాన్ టెహ్రీక్ ఇ ఇన్సాఫ్ సభ్యులు దాడి చేశారు.

లాహోర్ కోర్టు ఆదేశాల మేరకు కొత్త సీఎంను ఎన్నుకోవడానికి పంజాబ్ అసెంబ్లీ శనివారం సమావేశమైంది. ఈ సభను సజావుగా నిర్వహించేందుకు దోస్త్ మహమ్మద్ అక్కడికి చేరుకున్నారు. అయితే దిగిపోయిన మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ సభ్యులు మజారీపై విరుచుకుపడ్డారు.

ఆయనపైకి కమలం పువ్వులు విసిరారు. ఆయన చెంపలు వాయించారు. జుట్టు పట్టుకొని హింసించారు.సెక్యూరిటీ గార్డులు కూడా ఈ దాడిని ఆపలేకపోయారు. దాంతో మజారీ అక్కడి నుంచి అవమాన కర రీతిలో వెళ్లిపోయారు. ఈ రగడ వల్ల 11.30 నిమిషాలకు మొదలు కావాల్సిన సెషన్ ఆలస్యమైంది.

ఇమ్రాన్ పార్టీ సభ్యులపై అధికార పార్టీ నేతలు మండిపడ్డారు. అసెంబ్లీలో జరిగిన రచ్చకు పాక్ అసెంబ్లీ సభ్యులు ఇమ్రాన్ ఖాన్ పై విరుచుకుపడ్డారు. ఇమ్రాన్ అన్ని స్థాయిల్లో అరాచకం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

ముఖ్యమంత్రి ఎన్నికను అడ్డుకునేందుకు అసెంబ్లీలో హింసను ప్రేరేపించారని ఆరోపించారు. ఇమ్రాన్ హిట్లర్ శిష్యుడని నిరూపించుకుంటున్నాడని ఇక్బాల్ ట్వీట్ చేశారు.

కాగా పాకిస్తాన్ లో నాటకీయ పరిణామాల మధ్య ఇమ్రాన్ ప్రధానిగా వైదొలిగారు. అయినా సరే పాకిస్తాన్ లో రాజకీయ అస్థిరత కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఇరు పార్టీల సభ్యులు గొడవలకు, ఘర్షణలకు దిగుతున్నారు.