Begin typing your search above and press return to search.

వివేకా హత్య కేసులో రోజుకో వివాదం

By:  Tupaki Desk   |   30 Nov 2021 5:30 AM GMT
వివేకా హత్య కేసులో రోజుకో వివాదం
X
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో రోజుకో వివాదం వెలుగు చూస్తోంది. తాజాగా గంగాధర్ రెడ్డి అనే వ్యక్తి అనంతపురం ఎస్పీ ఫకీరప్ప ను కలిసి సీబీఐ అదనపు ఎస్పీ రామ్ సింగ్, ఒకప్పటి సిట్ అధికారి శ్రీరామ్, వివేకానందరెడ్డి కూతురు డాక్టర్ సునీత పై ఫిర్యాదు చేయటం సంచలనంగా మారింది. వివేకాను ఎంపీ అవినాశ్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, శంకర రెడ్డే హత్య చేయించినట్లు ఒప్పుకోవాలని తనపై రామ్ సింగ్, శ్రీరామ్, సునీత బాగా ఒత్తిడి తెస్తున్నట్లు రాత మూలకంగా గంగాధర్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

రామ్ సింగ్, శ్రీరామ్ నుండి తనతో పాటు తన కుటుంబానికి ప్రాణహాని ఉందని చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. వివేకా హత్య కేసులో నిందితుడైన శంకరరెడ్డికి తాను అనుచరునిగా గంగాధర్ పరిచయం చేసుకున్నారు. ఒకపుడు సిట్ అధికారులతో పాటు తర్వాత సీబీఐ అధికారులు కూడా తనను అనేకసార్లు విచారించినట్లు గంగాధర్ చెప్పాడు. ఈ విచారణలో అవినాష్, భాస్కరరెడ్డి, శంకరరెడ్డే హత్య చేయించినట్లు చెబితే రు. 10 కోట్లు ఇస్తామని ఆశచూపటమే కాకుండా అప్పటినుండి బాగా ఒత్తిడి పెడుతున్నట్లు ఆరోపించారు.

తనపై పై ముగ్గురు ఒత్తిడి తెస్తున్నట్లు ఆరోపించిన గంగాధర్ అందుకు గట్టి ఆధారాలను మాత్రం మీడియాకు చూపలేకపోయారు. మరి అంతకు ముందు ఫిర్యాదు చేసినపుడు ఎస్పీకి ఏమన్నా ఆధారాలు చూపించాడా లేదా అన్న విషయంలో క్లారిటీ లేదు. వివేకాకు ఒకపుడు డ్రైవర్ గా పనిచేసిన దస్తగిరి వాంగ్మూలమే సంచలనమైంది. ఆ తర్వాత దస్తగిరి అప్రూవర్ గా మారిపోతున్నట్లు ప్రచారం కూడా జరిగింది. ఇదే సమయంలో దస్తగిరి వాగ్మూలంపై శంకర్ రెడ్డి చేసిన ఆరోపణలు కలకలం రేపాయి.

ఇపుడు గంగాధర్ చేసిన ఆరోపణలు కూడా అలాగే ఉన్నాయి. అంటే హత్య కేసులో రోజుకో వివాదం తెరపైకి వస్తోంది. వీళ్ళంతా నిజంగానే హత్యకేసులో ఏరో రూపంలో పాత్రుందా లేకపోతే హత్య కేసు దర్యాప్తును పక్కదోవ పట్టించేందుకే పక్కా వ్యూహం జరుగుతోందా అనే అనుమానాలు కూడా పెరిగిపోతున్నాయి. శంకరరెడ్డి ఆరోపణల ప్రకారం వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖర రెడ్డే హత్యలో కీలక పాత్రదారి.

తాజాగా గంగాధర్ ఆరోపణల ప్రకారం ఎంపీ, ఆయన తండ్రి, శంకరరెడ్డి పేర్లు చెప్పాలని ఒత్తిడి పెడుతున్న వాళ్ళల్లో వివేకా కూతురు సునీత కూడా ఉన్నారు. గంగాధర్ ఆరోపణల ప్రకారం చూస్తే పై ముగ్గరిని ఇరికించేందుకే సునీత ప్రయత్నిస్తున్నట్లు, శంకరరెడ్డి ఆరోపణల ప్రకారం వివేకా హత్యలో అల్లుడికి కూడా కీలక పాత్రుంది. మరి ఏది నిజం.

తండ్రి హత్యలో తన భర్తకు కూడా కీలకపాత్ర ఉంటే మరి సునీత సీబీఐ విచారణ చేయాలని ఎందుకు పట్టుబడతారు? అన్నది ఇక్కడ ప్రశ్న. అలాగే వైఎస్ అవినాష్, వైఎస్ భాస్కర్ రెడ్డి పేర్లను ఇరికించాలని సునీత ఎందుకు ఒత్తిడి పెడుతున్నట్లు ? ఈ హత్య కేసులో ఇంకెన్ని పాత్రలు బయటకు వస్తాయో చూడాల్సిందే.