Begin typing your search above and press return to search.

రాజధాని శంకుస్థాపనపై వివాదం

By:  Tupaki Desk   |   23 Sep 2015 6:54 AM GMT
రాజధాని శంకుస్థాపనపై వివాదం
X
ఏపీ రాజధాని నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంపై వివాదం ముసురుకుంటోంది. ఈ కార్యక్రమ నిర్వహణ బాధ్యత అంతా ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని క్రిడా అధికారులు నిర్ణయం తీసుకోవడం వివాదాస్పదం అవుతోంది. భారత్‌, సింగపూర్‌, జపాన్‌ దేశాల ప్రధానులు... కేంద్ర మంత్రులు హాజరవుతున్న ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించడం లేదు..... ప్రయివేటు సంస్థలకు ఇవ్వడానికి నిర్ణయించింది. ఇందుకు కేవలం 4 రోజుల కాలపరిమితే విధించి ఆన్‌లైన్‌లో టెండర్లు ఆహ్వానించింది. రూ.5 లక్షలు దాటిన పనులకు సంబంధించి పత్రికల్లో టెండర్ల ప్రకటన ఇవ్వాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా దాదాపు రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్ల అంచనాలతో చేపట్టిన శంకుస్థాపన కార్యక్రమ నిర్వహణను క్రిడా వెబ్‌సైట్‌లోనే టెండర్లు ఆహ్వానించారు. ఈనెల 18న టెండర్లు ఆహ్వానించి 22న చివరి తేదీగా నిర్ణయించారు.

మరోవైపు ఈ టెండర్లు ముందే నిర్ణయమయ్యాయని... అందుకే కామ్ గా ప్రకటన లేకుండా వెబ్ సైట్ ఆధారంగానే టెండర్ల ప్రక్రియ నిర్వహించారన్ ఆరోపణలు వస్తున్నాయి. మొత్తం 50 ఎకరాల్లో ప్రపంచ స్థాయిలో హంగు ఆర్భాటాలతో రూపొందించనున్న ఈ కార్యక్రమం నిర్వహించడానికి... ఇప్పటికే దీనిపై అవగాహన... ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం ఉన్నవారు తప్ప ఇతరులెవరూ నాలుగు రోజుల్లో టెండర్లు దాఖలు చేసే పరిస్థితి లేదంటున్నారు. దీంతో టెండర్లు ముందే ఖరారైపోయాయన్న వాదన వినిపిస్తోంది. అంతేకాదు... శంకుస్థాపన కార్యక్రమానికి ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయడంపైనా విమర్శలొస్తున్నాయి.