Begin typing your search above and press return to search.

ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు మళ్లీ కేవీపీ!

By:  Tupaki Desk   |   27 Jan 2020 12:14 PM GMT
ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు మళ్లీ కేవీపీ!
X
కేవీపీ ..తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో కీలకనేతలలో ఒకరు. దివంగత నేత - మాజీ సీఎం వై ఎస్ రాజశేఖర్ రెడ్డికి ఆప్తమిత్రుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో తెలంగాణ ఏర్పాటును గట్టిగా వ్యతిరేకించిన నేతలలో ఈయన కూడా ఒకరు. అయితే, రాష్ట్రం విడిపోయిన తరువాత అయన ప్రత్యక్ష రాజకీయాలకి చాలా దూరంగా ఉంటూ వస్తున్నారు. రాజకీయాల నుండి పూర్తిగా దూరమైపోతున్నాడు అన్న తరుణంలో ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాలలో తళుక్కున మెరిశాడు. అది ఎదో సాదాసీదాగా మాత్రం కాదు ..మునిసిపాలిటీ ఎన్నికను ప్రభావితం చేసే విధంగా ఎంట్రీ ఇచ్చారు. పూర్తి వివరాలు చూస్తే ...

కేవీపీ ప్రస్తుతం రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో ఆయన రాజ్యసభ సభ్యత్వ పదవీ కాలం ముగియబోతోంది. ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున పెద్దలసభకు ప్రాతినిధ్యం వహిస్తుండగా.. రాష్ట్ర విభజన సమయంలో ఆయనను తెలంగాణకు కేటాయించారు. దాంతో ప్రస్తుతం ఆయన తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇకపోతే, ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీల మాదిరిగానే ఎంపీలకు కూడా మునిసిపాలిటీల్లో కోఆప్షన్ మెంబర్‌ షిప్ వుంటుంది. ఈ నేపథ్యంలో కేవీపి తనకు ఇష్టం వచ్చిన ఏదో ఒక మునిసిపాలిటీ లేదా మునిసిపల్ కార్పొరేషన్‌ లో ఛైర్మెన్ - మేయర్ ఎన్నికలో తన ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంటుంది.

ఇక జనవరి 25న వెల్లడైన తెలంగాణ మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవాన్ని ఎదుర్కున్నప్పటికీ . కొన్ని మునిసిపాలిటీల్లో మాత్రం గట్టి పోటీనిచ్చింది. కాంగ్రెస్ గట్టి పోటీనిచ్చిన వాటిల్లో సూర్యపేట జిల్లా నేరెడుచర్ల మునిసిపాలిటీ ఒకటి. ఇక్కడ మొత్తం 15 వార్డులుండగా.. టీఆర్ ఎస్ - కాంగ్రెస్ పార్టీలు చెరి 7 సీట్లలో గెలుపొందాయి. సీపీఎం పార్టీ మరో సీటు గెలుచుకుంది. సీపీఎం.. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించింది. దీనితో అక్కడ ఎలాగైనా ఛైర్మెన్ పదవిని చేజిక్కించుకోవాలని లక్ష్యంతో టీపీసీసీ అధ్యక్షుడు కొత్త ఎత్తు వేశారు. తాను లోక్ సభ సభ్యుని హోదాలో నేరెడుచర్ల మునిసిపాలిటీలో ఎక్స్ అఫీషియో మెంబర్‌ గా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ముందుకొచ్చారు. అలాగే రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు కూడా ఇక్కడే ఎక్స్‌ అఫీషియో మెంబర్ ఓటు వేసేందుకు కూడా లేఖ సమర్పించారు. దాంతో నేరెడుచర్ల మునిసిపాలిటీ లో కాంగ్రెస్ పార్టీ బలం 10కి చేరింది. దాంతో చాలా ఈజీగా ఛైర్మెన్ సీటు దక్కించుకోవచ్చని ఉత్తమ్ కుమార్ భావించారు.

కానీ , టీఆర్ ఎస్ పార్టీ ఎత్తుకుపై ఎత్తు వేసింది. తాము గెలిచిన ఏడుగురు కౌన్సిలర్లకు ఓ ఎమ్మెల్యేను - ఇద్దరు ఎమ్మెల్సీలను జత చేసి.. మొత్తం పది స్థానాలతో ఛైర్మెన్ పదవిని దక్కించుకునేందుకు ప్లాన్ చేసింది. ఇదే సమయంలో కాంగ్రెస్ కి కేవీపీ రూపంలో మరో ఓటు రావడంతో కాంగ్రెస్ పార్టీకి కూడా పది మంది సభ్యుల బలం వచ్చింది. దీనితో అక్కడ టఫ్ ఫైట్ ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే పెద్ద హైడ్రామా జరిగింది. కేవీపీ పేరును జాబితా నుంచి జిల్లా కలెక్టర్ తొలగించారు. దాంతో కాంగ్రెస్ నేతలు ఆదివారం రాత్రి ధర్నాలతో హోరెత్తించారు. సోమవారం ఉదయాన్నే కాంగ్రెస్ పార్టీ నేతలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డిని కల్వడంతో ఆయన కేవీపీ ఓటు హక్కును ధృవీకరించారు. ఈసీ నిర్ణయంతో రెండు పార్టీల బలాలబలాలు పదితో సమానంగా మారాయి.ఛైర్మెన్ ఎన్నిక కోసం మంగళవారం మరోసారి కౌన్సిల్‌ ను సమావేశపరచాలని నిర్ణయించారు. అయితే.. ఆ తర్వాత గంటసేపటికే అత్యంత నాటకీయ పరిణామాల నడుమ కేవీపీ పేరును జాబితా నుంచి మళ్ళీ తొలగించి.. సోమవారం సాయంత్రమే ఛైర్మెన్ ఎన్నికను నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. కేవీపీ ఓటు తిరస్కరించడంతో ప్రస్తుతం టీఆర్ ఎస్ బలం 10 - కాంగ్రెస్ పార్టీ బలం 9గా ఉంది. ఈ తరుణంలో కేవీపీ తన ఓటు హక్కు కోసం హైకోర్టు మెట్లు ఎక్కబోతున్నారని సమాచారం.