Begin typing your search above and press return to search.

షాక్‌: ఆ పోలీసుని కుర్చీకి క‌ట్టి మ‌రీ కొట్టేశారు

By:  Tupaki Desk   |   15 Oct 2017 5:05 AM GMT
షాక్‌: ఆ పోలీసుని కుర్చీకి క‌ట్టి మ‌రీ కొట్టేశారు
X
చ‌ట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదు. చ‌ట్టాన్ని కాపాడేవారు పోలీసులు. వారికి స‌హ‌క‌రించాలి.- ప్ర‌జాస్వామ్య దేశంలో ఇలాంటివి అంద‌రూ పాటించాల్సిందేన‌ని చ‌ట్టం, న్యాయం ప్ర‌జ‌ల‌కు పాఠ‌శాల‌లు పెట్టి మ‌రీ బోధించేస్తున్నాయి. మ‌రి ఆ చ‌ట్టాన్ని కాపాడాల్సిన పోలీసే త‌ప్పుచేస్తే.. ప్ర‌జ‌ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల్సిన పోలీసే భ‌క్ష‌ణ‌కు దిగితే.. ర‌క్తం మ‌రిగిపోదా? ఖ‌చ్చితంగా ఇదే జ‌రిగింది జ‌మ్ము కాశ్మీర్‌లో. ముఖ్యంగా దేశ‌వ్యాప్తంగా మ‌హిళ‌ల‌కు ఇంటా బ‌య‌టా కూడా ర‌క్ష‌ణ క‌రువ‌వుతోంద‌ని ప్ర‌ధాని నుంచి సీఎంల వ‌ర‌కు నెత్తీనోరూ మొత్తుకుంటున్నారు. నూత‌న చ‌ట్టాల‌కు ప‌దును పెడుతున్నారు. మ‌హిళ‌ల ప‌ట్ల అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించిన వారి తాట తీసీ ఖైదు చేస్తున్నారు.

ఇంత‌లా.. ఇంత సీరియ‌స్‌గా మ‌హిళ‌ల ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని ప్ర‌భుత్వాలు పౌరుల‌కు హెచ్చ‌రిక‌లు చేస్తున్నాయి. మ‌హిళ‌ల ర‌క్ష‌ణ‌కు యాప్‌లు తెస్తున్నాయి. ఇక‌, తెలంగాణ, యూపీ, హ‌ర్యానా వంటి రాష్ట్రాల్లో మ‌హిళ‌ల ర‌క్ష‌ణ‌కు మ‌హిళా పోలీసుల‌తో షీటీముల‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇంత‌లా ర‌క్ష‌ణ క‌ల్పిస్తున్నా మ‌హిళ‌ల ప‌ట్ల ఎక్క‌డో ఒక చోట రోజూ ఏదో ఒక అకృత్యం కామ‌న్ అయిపోయింది. ఇక‌, మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల్సిన పోలీసులే త‌ప్పుచేస్తే..? ఆమెకు భ‌రోసా క‌ల్పించాల్సిన ఖాకీనే క‌క్కుర్తి ప‌నుల‌కు పాల్ప‌డితే..? జ‌మ్ము క‌శ్మీర్‌లో ఇదే జ‌రిగింది. ఓ పోలీసు న‌డిరోడ్డుపై ఓ మ‌హిళ అంగాంగాల‌ను త‌న సెల్ ఫోన్‌లో బంధించేందుకు ప్ర‌య‌త్నించాడు. ఒక‌టి రెండు ఫొటోలు సైతం తీసేశాడు.

ఈ ఘ‌ట‌నే పెను దుమారానికి దారితీసింది. ఆ పోలీసుకు త‌గిన బుద్ధి చెప్పేలా చేసింది. విష‌యంలోకి వెళ్తే.. జ‌మ్ము క‌శ్మీర్‌లో ఎప్పుడూ ర‌ద్దీగా ఉండే గందెర్ బాల్ లో బుర‌ఖా ధ‌రించిన ఓ మ‌హిళ త‌న విధుల కోసం బ‌స్సు ఎక్కేందుకు రోడ్డుపై వేచి ఉంది. అయితే, అక్క‌డే విధులు నిర్వ‌హిస్తున్న ఓ పోలీసు.. ఈ మ‌హిళ‌ను త‌దేకంగా చూడ‌డంతోపాటు ఆమె అంగాంగాల‌ను త‌న సెల్‌ఫోన్‌లో ఫొటోలు తీశాడు. ఈ విష‌యం ఆ మ‌హిళ గ‌మ‌నించ‌లేదు. కానీ, స‌మీపంలోని వారు మాత్రం పోలీసు వెకిలి చేష్ట‌లు గుర్తించారు. వెంట‌నే పోలీసును నిల‌దీశారు. అయితే, ఆయ‌న ఘీంక‌రించాడు. న‌న్నే ప్ర‌శ్నిస్తారా? అంటూ ఎదురు తిరిగాడు.

అంతే.. కొంతమంది యువ‌కులు అత‌ని జేబులోని సెల్‌ఫోన్ లాక్కుని స‌ద‌రు మ‌హిళ‌కు సంబంధించిన ఫొటోల‌ను చూపించారు. దీంతో ఖంగుతిన్న స‌ద‌రు ఖాకీ.. త‌ప్పు ఒప్పుకున్నాడు. దీంతో అత‌నిని అక్క‌డే ఉన్న ప‌లువురు మ‌హిళ‌లు స‌హా బాధితురాలు రోడ్డుపై కుర్చీలో కూర్చోబెట్టి తాళ్లతో కట్టేసి మ‌రీ చితక్కొట్టేశారు. స‌ద‌రు పోలీసుపై బాధిత మహిళ ఉన్న‌తాధికారుల‌కు ఫిర్యాదు చేసింది. దీంతో ఆ ఖాకీని సస్పెండ్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో ఇప్పుడు వైర‌ల్ గా మారింది.