Begin typing your search above and press return to search.

మళ్లీ భయపెడుతున్న కరోనా అన్ని క్లోజ్ , లాక్ డౌన్ ప్రకటించిన ఆ ప్రభుత్వం !

By:  Tupaki Desk   |   29 Oct 2021 9:00 AM GMT
మళ్లీ భయపెడుతున్న కరోనా  అన్ని క్లోజ్ , లాక్ డౌన్ ప్రకటించిన ఆ ప్రభుత్వం !
X
ప్రపంచ దేశాలను కరోనా వైరస్ మరోసారి భయపెడుతోంది. చైనా లో పుట్టిన కరోనా వైరస్.. తగ్గినట్టే తగ్గి మళ్లీ విస్తరిస్తోంది. రకరకాల రూపాలను సంతరించుకుని ప్రజలను భయపెడుతోంది. తాజాగా కరోనా వైరస్‌ కొత్తరకం వేరియెంట్‌ ప్రపంచ దేశాలను భయపెడుతోంది. డెల్టా వేరియెంట్‌ ఉపవర్గమైన ఏవై.4.2 రకం ఇప్పుడు డేంజర్ బెల్ గా మారింది. రెండేళ్లుగా కరోనా వైరస్‌లో జన్యుపరమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు డెల్టా ఉపవర్గమైన ఏవై. 4.2 కరోనా కేసులు యూకేను వణికిస్తున్నాయి. అమెరికా, రష్యా, ఇజ్రాయెల్‌ లో కూడా ఈ కొత్త రకం వేరియెంట్‌ కేసులు నమోదవుతున్నాయి.

ముఖ్యంగా రష్యాలో కరోనా కేసులు పెరుగుతుండటంతో రష్యాలో పాక్షిక లాక్‌ డౌన్ విధించారు. మాస్కోలోని స్కూళ్లు, రెస్టారెంట్లను మూసేశారు. సూపర్ మార్కెట్లు, మెడికల్ షాపులు మినహా అన్ని రకాల దుకాణాలు మూతపడ్డాయి. హోటళ్లలో టేక్ అవే సర్వీస్ మాత్రమే అందుబాటులో ఉంది. కరోనా ఇన్ఫెక్షన్లను కట్టడి చేసేందుకు రష్యా ప్రభుత్వం రేపటి నుంచి తొమ్మిది రోజుల పాటు ఉద్యోగులకు సెలవులు ఇచ్చింది. గడిచిన 24 గంటల్లో రష్యాలో 1159 మంది కోవిడ్‌తో చనిపోయారు. రష్యాలోని 85 ప్రాంతాల్లో మొత్తం 40,096 కొత్త కేసులు నమోదయ్యాయి. రష్యాలో ఇదొక రికార్డ్.

కరోనా కారణంగా రష్యాలో 2,30,000 కంటే ఎక్కువ మందే చనిపోయారని అధికారికంగా ప్రకటించారు. యూరప్‌ దేశాలతో పోలిస్తే కోవిడ్‌తో ఇక్కడే ఎక్కువ మంది చనిపోయారు. మరణాల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రపంచ దేశాల్లో రష్యా ఒకటి. రష్యాలో వ్యాక్సీన్ వేసుకున్న వారి సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంది. అక్టోబర్ 23 నాటికి దేశ జనాభాలో 32.8శాతం మంది మాత్రమే వ్యాక్సీన్ వేసుకున్నారని సమాచారం. పాక్షిక లాక్‌డౌన్ విధించినప్పటికీ పెద్దగా మార్పు కనిపించడం లేదు. వీధులు సాధారణం కంటే కొద్దిగా తక్కువ రద్దీగా ఉన్నాయి. కానీ రోడ్లపై చాలా కార్లు తిరుగుతున్నాయి. టాక్సీలు నడుస్తున్నాయి.

మెట్రో రైళ్లలో కూడా రద్దీ కనిపిస్తోంది. హోటళ్ల నుంచి ఆహారాన్ని డెలివరీ చేసే వారి సంఖ్యా ఎక్కువగానే ఉంది.ప్రస్తుతం అమలు చేస్తున్న ఆంక్షలు కరోనావైరస్ నియంత్రణకు సరిపోవని భావిస్తే, రాబోయే రోజులు లేదా వారాల్లో పూర్తిస్థాయి లాక్‌ డౌన్ విధించే అవకాశం చాలా ఉంది. వ్యాక్సీన్లు వేసుకోవాలని ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేస్తోంది. వ్యాక్సినేషన్ డ్రైవ్‌లు చేపడుతోంది. కానీ స్పూత్నిక్ వి వ్యాక్సీన్‌పై చాలామంది రష్యన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ టీకా.. కోవిడ్‌పై ప్రభావవంతంగా పని చేస్తుందని అంతర్జాతీయంగా గుర్తించారు.

అక్టోబర్ 30 నుంచి నవంబర్ 9 వరకు పాక్షిక లాక్‌ డౌన్‌ విధించడంతో చాలామంది రష్యన్లు సెలవులో వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. రష్యన్లు ఎక్కువగా వెళ్లే ఈజిప్ట్‌ లోని రిసార్ట్ హోటళ్లు పూర్తిగా నిండిపోయాయి. ఈజిప్ట్‌ కు వెళ్లే రష్యా విమానాల్లో టికెట్లు కూడా పూర్తిగా అమ్ముడయిపోయాయి. కొత్త ఆంక్షలతో భయాందోళనకు గురైన కొందరు ప్రజలు నిత్యవసర సరుకులను కొని నిల్వ చేసుకున్నారని రష్యన్ న్యూస్ సర్వీస్ వెస్టి వెల్లడించింది.