Begin typing your search above and press return to search.

ఆంధ్రా యూనివర్సిటీలో కరోనా కలకలం 65 మందికి పాజిటివ్!

By:  Tupaki Desk   |   27 March 2021 12:07 PM GMT
ఆంధ్రా యూనివర్సిటీలో కరోనా కలకలం 65 మందికి పాజిటివ్!
X
విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీలో కరోనా కలకలం రేపుతోంది. యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుతున్న 65 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ కావడంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. దీనితో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అలర్ట్ అయ్యారు. విద్యార్థులకు కరోనా వైరస్ సోకడంపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులను మంత్రి అప్రమత్తం చేశారు. విశాఖ జిల్లా డీఎంహెచ్‌వో డాక్టర్ సూర్యనారాయణతో మంత్రి ఆళ్ల నాని ఫోన్‌లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఏయూ ఇంజనీరింగ్ క్యాంపస్‌లో 1,500 మంది విద్యార్థులకు కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా, 65మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. జిల్లాలో ప్రతి రోజూ దాదాపు 7,500 మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. జిల్లాలో 6 కోవిడ్ హాస్పిటల్స్ ఏర్పాటు చేశామన్నారు. కరోనా సోకిన బాధితులు ప్రస్తుతం కేజీహెచ్ హాస్పిటల్‌లో 15 మందికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేశామని మంత్రి ఆళ్లనాని వెల్లడించారు.

ఇదిలా ఉండగా.. ఏప్రిల్‌ 6వ తేదీ వరకు ఇంజినీరింగ్ పరీక్షలు జరుగాల్సి ఉంది. పరీక్షల కోసమే విద్యార్థులు హాస్టల్‌కు వచ్చారు. విద్యార్థులు వైరస్ బారినపడడంతో యూనివర్సిటీ కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం జరగాల్సిన పరీక్షలన్ని వాయిదా వేసింది. మళ్లీ ఎప్పుడు పరీక్షలు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తామని పేర్కొంది. ఇకపై అన్ని తరగతులకు ఆన్‌లైన్‌ బోధన చేపట్టాలని ఆదేశించింది.