Begin typing your search above and press return to search.

ఏపీలో మ‌రో కొత్త పార్టీ.. సీఎం జ‌గ‌నే టార్గెట్ ?

By:  Tupaki Desk   |   29 Sep 2021 3:30 AM GMT
ఏపీలో మ‌రో కొత్త పార్టీ.. సీఎం జ‌గ‌నే టార్గెట్ ?
X
క‌రోనా విష‌యంలో నెల్లూరు జిల్లా కృష్ణ‌ప‌ట్నంకు చెందిన ఆనంద‌య్య మందు ఒక్క‌సారిగా దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది. ఆయుర్వేద వైద్యుడు అయిన ఆనంద‌య్య త‌యారు చేస్తోన్న మందు క‌రోనాపై బాగా ప్ర‌భావం చూపుతోంద‌న్న వార్త‌ల‌తో ఒక్క‌సారిగా ఆయ‌న వార్త‌ల్లోకి ఎక్కేశారు. ఆయ‌న మందు కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌తో పాటు మ‌హారాష్ట్ర‌, క‌ర్నాక‌ట‌, త‌మిళ‌నాడు నుంచి కూడా వేలాది మంది కృష్ణ‌ప‌ట్నం వ‌చ్చారు. క‌రోనా సెకండ్ వేవ్ టైంలో కృష్ణ‌ప‌ట్నం పేరు మార్మోగిపోయింది. త‌ర్వాత చాలా మంది ఆనంద‌య్య ఫార్ములాను ఫాలో అయ్యి ఎక్క‌డిక‌క్క‌డ మందు త‌యారు చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేశారు.

ఏదేమైనా క‌రోనా సెకండ్ వేవ్ టైంలో ఆనంద‌య్య గురించి మీడియాలో ఎంత‌లా చ‌ర్చ జ‌రిగిందో తెలిసిందే. చివ‌ర‌కు మెడిక‌ల్ మాఫియా సైతం ఆయ‌న్ను కొన్ని మీడియా సంస్థ‌ల ద్వారా టార్గెట్ చేయించ‌డం.. చివ‌ర‌కు ప్ర‌భుత్వం కూడా ఆయ‌న్ను అరెస్టు చేయ‌డం లాంటి సంఘ‌ట‌న‌లు జ‌రిగాయి. అయితే ఇప్పుడు ఆనంద‌య్య గురించి ఏ వార్త కూడా రావ‌డం లేదు. ఇలాంటి టైంలో ఆనంద‌య్య ఈ సారి స్వ‌యంగా మ‌రో సంచ‌ల‌నానికి రెడీ అయిన‌ట్టే తెలుస్తోంది.

ఈ సారి ఆనంద‌య్య పొలిటిక‌ల్ ఎంట్రీ ఇస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఆయ‌న ఏకంగా కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అవుతున్నారు. ఆనంద‌య్య ఏంటి ? పొలిటిక‌ల్ పార్టీ పెట్ట‌డం ఏంట‌న్న సందేహాలు కూడా వ‌స్తున్నాయి. తాను క‌రోనాకు మందు త‌యారు చేస్తోన్న టైంలో ఏపీ ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి స‌హాయ స‌హ‌కారాలు లేవ‌ని.. పైగా త‌న‌ను అరెస్టు చేయించ‌డంతో మందు పంపిణీ ప్ర‌క్రియ‌లో అనేకానేక ఆటంకాలు వ‌చ్చాయ‌ని ఆయ‌న ఆవేద‌న చెందార‌ట‌. పైగా పొరుగు రాష్ట్రాలు అయిన త‌మిళ‌నాడు, క‌ర్నాట‌క నుంచి ఎంతో మంది వ‌చ్చి పారితోష‌కంగా చాలా సాయం చేస్తే.. ఏపీ ప్ర‌భుత్వం నుంచి స‌హాయం లేక‌పోగా ఇబ్బందులు ఎదుర‌వ్వ‌డంతో ఆయ‌న రగిలిపోయార‌ట‌.

ప్ర‌జ‌ల ప్రాణాలు కాపాడేందుకు తాను ఎంతో క‌ష్ట‌ప‌డుతుంటే కనీసం ఏపీ ప్ర‌భుత్వం నుంచి గుర్తింపు లేద‌ని కూడా ఆయ‌న స‌న్నిహితుల వ‌ద్ద వాపోయిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. పైగా ఆయ‌న మందును అదే వైసీపీ నేత‌లు త‌మ రాజ‌కీయ ల‌బ్ధి కోసం వాడుకున్నారు. దీనిపై కూడా ఆనంద‌య్య అప్ప‌ట్లోనే ఫైర్ అయ్యారు. ఇక ఇప్పుడు ఆయ‌న సొంత పార్టీ పెట్ట‌డంతో పాటు సామాజిక న్యాయం జ‌రిగే వ‌ర‌కు పోరాటం చేస్తాన‌ని ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం. ఆనంద‌య్య బీసీల్లో బ‌ల‌మైన యాద‌వ సామాజిక వ‌ర్గానికి చెందిన వారు. ఆయ‌న త‌న పార్టీతో బీసీ కులాల‌కు న్యాయం జ‌రిగేలా ఉద్య‌మిస్తాన‌ని చెప్ప‌డం ఏపీ రాజ‌కీయాల్లో క‌ల‌క‌లం రేపుతోంది.