Begin typing your search above and press return to search.

వారందరికీ కరోనా బూస్టర్ డోస్.. ఆదివారం నుంచే!

By:  Tupaki Desk   |   9 April 2022 3:30 AM GMT
వారందరికీ కరోనా బూస్టర్ డోస్.. ఆదివారం నుంచే!
X
చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి కొత్త కొత్త వేరియంట్లతో పుట్టుకొస్తుంది. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ లో చూపినంత ఎఫెక్ట్ చూపించకపోయినప్పటికీ... ఇప్పటికీ ప్రజల్ని ఇబ్బంది పెడుతూనే ఉంది. అయితే మరోసారి కరోనా వస్తున్నందున కేంద్ర ప్రబుత్వం అప్రమత్తమైంది. 18 ఏళ్లు పైబడ్డ వారందరికీ కొవిడ్ టీకా బూస్టర్ అందించేందుకు సిద్ధం అయింది. ఏప్రిల్ 10వ తేదీ అంటే ఆదివారం నుంచి ప్రైవేటు వ్యాక్సినేషన్ కేంద్రాల్లో వయోజనులు అందరికీ కరోనా టీకా ప్రికాషన్ డోసులు అందుబాటులో ఉంటాయని ప్రకటించింది.

కరోనా టీకా రెండో డోసు తీసుకునని తొమ్మిది నెలలు పూర్తయిన వారందరూ బూస్టర్ డోస్ తీసుకోవచ్చని ప్రభుత్వం వివరించింది. అర్హులైన వారందరికీ ప్రభుత్వ టీకా కేంద్రాల ద్వారా కరోనా మొదటి, రెండో డోసు టీకాతో పాటు బూస్టర్ డోస్ కూడా ఇస్తామని స్పష్టం చేసింది. అయితే ముందుగా ఆరోగ్య కార్యకర్తలకు, 60 ఏళ్లు పైనున్నవారికి ఇస్తున్న బూస్టర్ డోసును యథావిధిగా కొనసాగిస్తారు.

ఇప్పటి వరకు దేశంలో 15 ఏళ్లు పైనున్న 96 శాతం జనాభాకు కనీసం ఒక డోసు పూరైంది. 83 శాతం మంది రెండు డోసులు తీసుకున్నారు. 2.4కోట్ల ప్రికాషన్ డోసులను ఆరోగ్య కార్యకర్తలకు, 60 ఏళ్లు పైనున్నవారికి పంపిణీ చేశారు. 12-14 ఏళ్ల పిల్లల్లో 45 శాతం మంది మొదటి డోసు తీసుకున్నారు.

కానీ కరోనా వైరస్‌ విజృంభణతో చైనా మల్లీ అల్లాడిపోతోంది. నిత్యం రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదవుతూ చైనీయులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. కొవిడ్‌ కట్టడిలో భాగంగా ఇప్పటికే కోట్ల మందిపై లాక్‌డౌన్‌ ఆంక్షలు విధిస్తున్నా వేల సంఖ్యలో కేసులు బయట పడడం చైనా అధికారులకు ఊపిరి ఆడకుండా చేస్తోంది. ఇదే సమయంలో కొత్తగా కరోనా ఉపరకం వెలుగు చూడడం చైనా అధికారులను కలవరపెడుతోంది. భారత్కు కూడా ఈ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో కేంద్రం బూస్టర్ డోసులు ఇవ్వడంపై దృష్టి పెట్టింది.

కరోనా టీకా బూస్టర్‌ డోసు వల్ల ఒమిక్రాన్‌ నుంచి సమర్థమైన యాంటీబాడీ రక్షణ లభిస్తోందని పలు పరిశోధనల్లో ఇప్పటికే తేలింది. టీకా రెండు డోసులు వేసుకున్న వారితో పోలిస్తే మూడు డోసులు తీసుకున్న వారిలో 2.5 రెట్లు యాంటీబాడీలు ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నాయని బ్రిటన్ పరిశోధకులు వెల్లడించారు. అందుకే అర్హులందరూ కరోనా రెండు డోసులతో పాటు బూస్టర్ డోసు కూడా తీసుకోవాలని అధికారులు, నిపుణులు వివరిస్తున్నారు.