Begin typing your search above and press return to search.

కరోనా కలకలం.. చైనాలోని కీలక నగరాల్లో లాక్‌డౌన్‌

By:  Tupaki Desk   |   23 May 2022 7:33 AM GMT
కరోనా కలకలం.. చైనాలోని కీలక నగరాల్లో లాక్‌డౌన్‌
X
డ్రాగన్ దేశం చైనాలో మహమ్మారి మళ్లీ జడలు విప్పుతోంది. రోజురోజుకు విజృంభిస్తూ ప్రపంచాన్ని మరోసారి భయపెట్టేందుకు రెడీ అవుతోంది. ఎన్ని ఆంక్షలు విధించినా.. చైనాలో కరోనా కల్లోలాన్ని అక్కడి ప్రభుత్వం కట్టడి చేయలేకపోతోంది. ఆంక్షల చట్రంలో రాజధాని బీజింగ్‌ ప్రజలు మళ్లీ ఇబ్బందులు పడుతున్నారు.

చైనాలో కొత్తగా 157 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో 52 బీజింగ్‌లోనే వెలుగు చూడటంతో రాజధాని నగరంలో సర్కార్ ఆంక్షలు విధించింది. జీరో కొవిడ్ పాలసీని అమలు చేస్తూ ఆదివారం నుంచి నగరంలో లాక్‌డౌన్ ప్రకటించారు. కొవిడ్ వ్యాప్తి మళ్లీ వేగంగా విస్తరిస్తుండటంతో మరిన్ని నగరాల్లోనూ లాక్‌డౌన్ అమలు చేయాలని చైనా ప్రభుత్వం యోచన చేసింది. హయిడియన్, చావోయాంగ్, ఫెంతాయ్, షన్‌యీ, ఫాంగ్‌షాన్ జిల్లాల్లో అధికారులు కఠిన ఆంక్షలు విధించారు.

బీజింగ్‌ నగరంలోని నాంగ్జిన్యూన్ రెసిడెన్షియల్ కాంపౌండ్‌లో కొత్తగా 26 కరోనా కేసులు నమోదైనట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. కొవిడ్ వ్యాప్తి ఎంత వేగంగా ఉంటుందో.. చైనా అధికారుల చర్యలు అంతకంటే వేగంగా.. కాస్త కఠినంగానే ఉంటాయి.

అందుకే రాత్రికి రాత్రే ఆ ప్రాంతం నుంచి సుమారు 13 వేల మందిని అధికారులు క్వారంటైన్‌కు తరలించారు. ఆహారం డెలివరీలు చేసే రెస్టారెంట్లు, ఫార్మసీలు మినహా థియేటర్లు, జిమ్‌లు, షాపింగ్ మాల్స్ వంటి వాటిని మూసివేశారు. పార్కులను మాత్రం 30 శాతం సామర్థ్యంతో నిర్వహించేందుకు అనుమతించారు.

బీజింగ్‌లోని హయిడియన్, చావోయాంగ్, ఫెంతాయ్, షన్‌యీ, ఫాంగ్‌షాన్ జిల్లాల ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లకూడదనే ఆదేశాలు జారీ చేశారు. వారంతా ఇంట్లో నుంచే వర్క్ ఫ్రం హోం చేయాలని ఆదేశించారు. మే 28 వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు. ఆంక్షలు అమలు చేయడంలో చైనా ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరిస్తుందో.. తమకు ఆటంకం కలిగించే నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంటే అక్కడి ప్రజలు అంతే కఠినంగా స్పందిస్తారు. అవసరమైతే ఉద్ధృతమైన నిరసన తెలుపుతారు.

ఇప్పుడు కరోనా కట్టడికి ఈ డ్రాగన్ దేశం అవలంభిస్తున్న జీరో కొవిడ్ విధానంపై ఆ దేశవ్యాప్తంగా అసంతృప్తి పెరుగుతోంది. విద్యార్థులంతా రహదారులపైకి చేరి నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు. బీజింగ్ యూనివర్సిటీ, పెకింగ్ విశ్వవిద్యాలయాల విద్యార్థులు ఆందోళన చేపట్టడంతో విద్యాసంస్థల్లో ఆంక్షలపై అధికారులు వెనక్కి తగ్గారు. షాంఘైలో స్థానికులు పోలీసులు, వాలంటీర్లతోనూ ఘర్షణలకు దిగుతున్నారు. అయితే, ఈ ఆంక్షల ఫలితంగా ఇతర దేశాల కంటే మరణాలు తగ్గాయని ప్రభుత్వం తెలిపింది.