Begin typing your search above and press return to search.

గాలి ద్వారా కరోనా.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం!

By:  Tupaki Desk   |   26 May 2021 3:30 PM GMT
గాలి ద్వారా కరోనా.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం!
X
కరోనా మహమ్మారి ఏడాది కాలంగా కోరలు చాస్తోంది. వివిధ రకాలు మ్యాటేట్ అవుతూ... వివిధ పద్ధతుల్లో వ్యాపిస్తూ కరాళ నృత్యం చేస్తోంది. వైరస్ సోకిన వ్యక్తి తుమ్మినా, దగ్గినా, లేక ప్రత్యక్ష తాకిడీలోనే వ్యాపిస్తుందని మునుపటి మార్గదర్శకాల్లో ఉంది. కానీ గాలి ద్వారా వ్యాపిస్తుందనేది తాజా అంశం. దీనిపై కేంద్ర మంత్రిత్వ శాఖ క్లారిటీ ఇచ్చింది.

తుమ్ములు, దగ్గు తుంపర్లలోనే కాకుండా గాలిలో వైరస్ ఉంటుందని క్లినికల్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్ లో కేంద్రం స్పష్టం చేసింది. గతేడాది ఈ అంశాన్ని ప్రభుత్వంతో పాటు పలువురు నిపుణులు వ్యతిరేకించారు. ప్రస్తుతం మారిన పరిస్థితులతో వైరస్ వ్యాప్తి పద్ధతులు మారాయని పేర్కొన్నారు. వైరస్ తో కూడిన ఏరోసోల్ ను పది మీటర్ల వరకు గాలి మోసుకెళ్తుందని కేంద్ర శాస్త్రీయ సలహాదారు కార్యాలయం వెల్లడించింది. ఒక మీటరు లోపు వైరస్ బాధితులతో సన్నిహితంగా ఉంటే సోకుతుందని తెలిపింది.

వెంటిలేషన్ తక్కువగా ఉన్న ప్రదేశంలో, రద్దీగా ఉన్న ప్రాంతాల్లో గాలి ద్వారా వైరస్ త్వరగా వ్యాపిస్తుందని హెచ్చరించింది. ఏరో సోల్స్ 10 మీటర్ వరకు వైరస్ తో ప్రయాణం చేయగలవని డబ్ల్యూహెచ్వో వెల్లడించింది. గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదివరకు ప్రత్యక్ష తాకిడీ లేకపోతే వైరస్ సోకదనే భావనలో ఉన్నారని కానీ గాలితో వ్యాప్తి అతివేగంగా జరుగుతుందని అంటున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోటోకాల్ ని కేంద్రం విడుదల చేసింది.

తేలికపాటి లక్షణాలు కలిగిన వ్యక్తులకు, పాజిటివ్ కేసులు తక్కువగా ఉన్న సమయంలో ఐవర్ మెక్టిన్ 3 నుంచి 5 రోజుల వరకు ఇవ్వొచ్చని కేంద్రం సిఫార్సు చేసింది. గర్భిణీ, పాలిచ్చే తల్లులకు ఇవ్వకూడదని తెలిపింది. గతేడాది ప్రోటోకాల్ లో ఈ నిబంధన లేదు. తక్కువ లక్షణాలు ఉంటే స్టెరాయిడ్స్ వాడొద్దని సూచించింది. వారం దాటినా విపరీత జ్వరం తగ్గకపోతే కొద్ది మోతాదులో మాత్రమే వాడాలని పేర్కొంది. ప్లాస్మా థెరఫీని నిరోధిస్తూ నిర్ణయం తీసుకుంది. గతేడాది దీనికి మంచి స్పందన వచ్చింది. కానీ తాజా మార్గదర్శకాల నుంచి తొలగించింది. దీనివల్ల ఫలితం లేదని పరిశోధనల్లో తేలిందని పేర్కొంది.