Begin typing your search above and press return to search.

నిజామాబాద్ లో కరోనా కలకలం?

By:  Tupaki Desk   |   17 March 2020 7:45 AM GMT
నిజామాబాద్ లో కరోనా కలకలం?
X
విదేశాలకు ముఖ్యంగా ఎడారి దేశాలకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. విదేశాల నుంచి వచ్చే ప్రజలను వైద్య సిబ్బంది మిగతా అధికార యంత్రాంగంతో కలిసి చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో జిల్లాలో కరోనా లక్షణాలతో బాధపడే వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ జిల్లా నుంచి కరోనా అనుమానితులు పెరుగుతున్నారు. అయితే సోమవారం నిజామాబాద్ లోని ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనాపై కలకలం రేగింది. ఎందుకంటే కరోనా వైరస్‌ లక్షణాలు ఉన్నాయనే అనుమానం తో ఓ వ్యక్తిని ఐసోలేషన్‌ వార్డుకు తరలిస్తుండగా ఆ వ్యక్తి భయం తో పరారయ్యాడని వార్తలు వినిపిస్తున్నాయి.

నిజామాబాద్ కు చెందిన ఓ యువకుడు (35) ఇటీవల మహారాష్ట్రలోని తమ బంధువుల పెళ్లికి వెళ్లాడు. తిరిగి వచ్చినప్పటి నుంచి జ్వరం, జలుబు, దగ్గు తో బాధపడుతుండడం తో సోమవారం ఆస్పత్రికి వచ్చాడు. దీంతో ఆస్పత్రిలోని మూడో అంతస్తులో వైద్యులు పరీక్షించగా జ్వరం, జలుబు, దగ్గు ఉందని గుర్తించి ఈ విషయం ఆస్పత్రి సూపరింటెండెంట్‌ నాగేశ్వరరావుకు తెలిపారు. కరోనా లక్షణాలు ఉన్నాయని చెప్పి అతడిని ఐసోలేషన్‌ వార్డుకు పంపిస్తుండగా అతడు భయపడి తమ బంధువులకు చెప్తానని చెప్పి ఆస్పత్రి నుంచి పరారయ్యాడని తెలుస్తోంది. అయితే విషయం వాస్తవం కాదని ఆ ఆస్పత్రి సూపరింటెండెంట్ స్పష్టం చేశారు.

ఇదే మరో ఘటన జరిగింది. కరోనా లక్షణాలు ఉన్నాయనే అనుమానం తో నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తిని సోమవారం రాత్రి గాంధీ ఆస్పత్రికి తరలించారని సమాచారం. మోర్తాడ్‌ మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి (40) ఉపాధి కోసం సౌదీకి వెళ్లి పది రోజుల కిందట తిరిగి వచ్చాడు. ఇక్కడికి వచ్చాక తీవ్ర జ్వరం, దగ్గు తో బాధపడుతుండడం తో స్థానికంగా ఆర్‌ఎంపీ వద్ద వైద్యం పొందినా నయం కాకపోవడం తో సోమవారం నిజామాబాద్ లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి రాగా వైద్యులు కరోనా లక్షణాలున్నాయని గుర్తించారంట. ఈ మేరకు హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రికి తరలించారని సమాచారం. అయితే ఈ విషయాన్ని కూడా అధికారులు కొట్టిపారేస్తున్నారు. ఇవన్నీ వాస్తవం కాదని చెబుతున్నారు.