Begin typing your search above and press return to search.

కరోనా కేంద్రాలు బడులు..కాలేజీలేనా? ఇంకేమీ లేవంటారా కేసీఆర్?

By:  Tupaki Desk   |   25 March 2021 3:30 PM GMT
కరోనా కేంద్రాలు బడులు..కాలేజీలేనా? ఇంకేమీ లేవంటారా కేసీఆర్?
X
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్కూళ్లు.. కాలేజీలు.. విశ్వవిద్యాలయాలు అన్నింటిని మూసివేస్తూ కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బుధవారం పరీక్షల్ని నిర్వహించినా.. ఈ రోజు (గురువారం) నుంచి పరీక్షల్ని సైతం వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

కాలేజీ హాస్టళ్లతో పాటు.. వర్సిటీ హాస్టళ్లను ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కేసులు పెరుగుతున్న వేళ.. స్కూళ్లు... కాలేజీలు మాత్రమే మూసివేస్తే సరిపోతుందా? మరింకేమీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదా? అని ప్రశ్నిస్తున్నారు. పెద్ద ఎత్తున ప్రజలు బయటకు రావటం.. వీధులన్నికిక్కిరిపోవటం.. ట్రాఫిక్ భారీగా ఉండటం.. మార్కెట్లు కిటకిటలాడటం లాంటి వాటి కారణంగా కరోనా కేసులు పెరగటం లేదా? అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

మిగిలిన చర్యలు తీసుకోని కేసీఆర్ సర్కార్.. కేవలం విద్యా సంస్థల్ని మాత్రమే మూసివేయాలని భావించటంలో అర్థం లేదని చెబుతున్నారు. సినిమాహాళ్లు.. బార్లు.. రెస్టారెంట్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే.. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలు చాలానే కనిపిస్తాయి. మరి.. వాటి దగ్గర లేని నియంత్రణ.. ఒక్క విద్యా సంస్థల మీదనే ఎందుకు? అన్న సూటి ప్రశ్నను పలువురు సంధిస్తున్నారు.

విద్యా సంస్థల మూతివేతపై తీసుకున్న నిర్ణయంతో.. వాటి మీద ఆధారపడిన లక్షలాది కుటుంబాలు తీవ్ర ప్రభావానికి గురి అవుతాయని.. ఇప్పటికే ఎంతోమంది రోడ్డున పడ్డారని.. రానున్న రోజుల్లో పరిస్థితి మరింత దారుణంగా మారుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అదే సమయంలో కేసీఆర్ సర్కారుపై తీవ్రంగా మండిపడుతూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.