Begin typing your search above and press return to search.

భారత్ లోనే కరోనా మరణాలు తక్కువ..!

By:  Tupaki Desk   |   30 March 2022 11:30 PM GMT
భారత్ లోనే కరోనా మరణాలు తక్కువ..!
X
కరోనా సెకండ్ వేవ్ సమయంలో భారత్ లోనే కరోనా మరణాలు తక్కువగా నమోదు అయినట్లు కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. దేశంలో కరోనా మరణాల సంఖ్య అధికారిక లెక్కల కంటే మరింత ఎక్కువగా ఉండవచ్చని అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ లో ప్రతి పది లక్షల జనాభాకు 374 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కరోనా వైరస్ తీవ్రత అధిక స్థాయిలో విజృంభిస్తున్న అమెరికా, ఇటలీ, బ్రెజిల్, మెక్సికో వంటి దేశాలతో పోలిస్తే భారత్ లోనే కరోనా మరణాల రేటు తక్కువని తెలుస్తోంది.

భారత్ లోనే కరోనా మరణాలు ఎక్కువగా ఉన్నాయంటూ వస్తున్న వార్తలపై రాజ్యసభ సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య శాఖ సమాధానం తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం... ప్రతి 10 లక్షల మందికి అతి తక్కువ కరోనా మరణాలు నమోదైన దేశాల్లో భారత్ ఒకటిగా ఉందంటూ లిఖితపూర్వకంగా రాసి పంపింది. అంతే కాదు అమెరికాలో10 లక్షల మందికి 2 వేల 920 మరణాలు నమోదైనట్లు తెలిపింది. ఇక బ్రెజిల్ లో 3 వేల 92, రష్యాలో 2 వేల 506, మెక్సికోలో 2 వేల 498 మది కొవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయారు.

అయితే అదే భారత్ లో ప్రతి 10 లక్షల జనాభాకు 374 మంది మాత్రమే ప్రాణాలు కోల్పోయారని వివరించింది. ఇతర దేశాల మరణాలతో పోలిస్తే... ఈ సంఖ్య చాలా తక్కువని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో కరోనా మరణాలకు సంబంధించి మే 10వ తేదీ 2020న ఐసీఎమ్ఆర్ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన నిబంధనలపై అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు కూడా జారీ అయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ తెలిపారు.

కరోనా మరణాలు భారీగా పెరిగాయంటూ వచ్చిన నివేదికలన్నీ వాస్తవాలు కావని... అందుబాటులో ఉన్న డేటా ప్రకారం అంచనా మాత్రమేనని కేంద్రం స్పష్టం చేసింది. దేశంలో కొంత జనాభాకు సంబంధించి డేటాను సేకరించి గణాంక పద్ధతిలో రూపొందించినవేనని తెలిపింది. ఆ పరిమిత నమూనాలతో దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్యతో అంచనా వేశారని పేర్కొంది. దేశవ్యాప్తంగా నమోదయ్యే కరోనా కేసులు, మరణాలకు సంబంధించిన డేటా ను అన్ని రాష్ట్రాలు ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తూనే ఉన్నాయని తెలిపింది.

మిగతా దేశాలతో పోలిస్తే... భారత్ లో కరోనా మరణాలు సంఖ్య చాలా తక్కువగా ఉంది. అంతే కాకుండా చాలా ఎక్కువ మంది త్వరగా కరోనా నుంచి కోలుకున్నారు. అంతే కాకుండా కరోనా ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉన్నన్ని రోజులు ప్రజలు ఎక్కువగా ఇళ్ల నుంచి బయటకు రాకుండా ప్రభుత్వానికి సహకరించినట్లు తెలిపారు.

అక్కడక్కడా కొన్ని కేసులు నమోదైతే... వారికి హోం ఐసోలేషన్ లేదా ఆస్పత్రుల్లో చికిత్స అందించినట్లు వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాగ్రత్తగా ఉండటం వల్ల భారత్ లో కరోనా మరణాలు కట్టడి చేయగలిగాం అని కేంద్రం ప్రభుత్వ అధికారులు తెలిపారు.