Begin typing your search above and press return to search.

శుభవార్త : వెయ్యి రూపాయలకే కరోనా వ్యాక్సిన్!

By:  Tupaki Desk   |   29 April 2020 7:15 AM GMT
శుభవార్త : వెయ్యి రూపాయలకే కరోనా వ్యాక్సిన్!
X
కరోనా.. కరోనా.. కరోనా.. ఏ నోట విన్నా ఇదే పేరు. ప్రపంచమే ఈ వైరస్ జపం చేస్తోంది. ఎంత త్వరగా వ్యాక్సిన్ వస్తే అంత త్వరగా ఈ మహమ్మారి చెర నుంచి బయటపడాలని చూస్తోంది. భారత్ సహా అన్ని దేశాలు వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమయ్యాయి. అమెరికా - జర్మనీ - బ్రిటన్ - చైనా సహా పెద్ద దేశాలన్నీ క్లినికల్ ట్రయల్స్ కూడా మొదలు పెట్టే పనిలో ఉన్నాయి. ఈ తరుణంలోనే పూణెకు చెందిన సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా గుడ్‌ న్యూస్ చెప్పింది. కరోనా వ్యాక్సిన్ హ్యూమ‌న్ ట్ర‌య‌ల్స్‌ను త్వ‌ర‌లో ప్రారంభిస్తున్న‌ట్లు చెప్పింది.

ఈ కంపెనీ క్లినికల్ ట్రయల్స్ విజయవంతమైతే రూ.వెయ్యికే వ్యాక్సిన్ అందిస్తామ‌ని ఆ సంస్థ తెలిపింది. దేశ ప్ర‌జ‌ల‌కు క‌రోనా వ్యాక్సిన్ ‌ను రూ. వెయ్యికే అందుబాటులోకి తీసుకురానున్న‌ట్లు ప్ర‌ముఖ వ్యాక్సిన్ అభివృద్ధి సంస్థ సీరం ఇన్‌ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అద‌ర్ పూనావాలా చెప్పారు. కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ విజయవంతమైతే సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌ నాటికి రెండు నుంచి నాలుగు కోట్ల డోసులను ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని అదర్ తెలిపారు. మొద‌టి ద‌శ‌లో నెల‌కు 10 మిలియ‌న్ల డోసుల‌ను సిద్ధం చేస్తామ‌న్నారు. త‌రువాత నెల‌కు 20 నుంచి 40 మిలియ‌న్ల డోసుల‌ను త‌యారు చేస్తామ‌న్నారు.

సీరం కంపెనీని ఆయన తండ్రి సైరస్ పూనావాలా 1966లో స్థాపించారు. ఈ కంపెనీ ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సిన్ మానుఫాక్చర్. 1.5 బిలియన్ డోసులను ఉత్పత్తి చేస్తోంది. దాదాపు 65 శాతం మంది పిల్లల రోగ నిరోధక శక్తి పెంచడంలో తోడ్పాటునందిస్తోంది.