Begin typing your search above and press return to search.

కరోనా ఎఫెక్ట్ : ఏపీ అష్టదిగ్బంధనం

By:  Tupaki Desk   |   21 March 2020 11:06 AM GMT
కరోనా ఎఫెక్ట్ : ఏపీ అష్టదిగ్బంధనం
X
కరోనా దెబ్బకు యావత్ ప్రపంచం వణికిపోతోంది. భారత్‌ లో క్రమక్రమంగా  కరోనా కేసులు పెరిగిపోతుండటంతో  అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇటు ప్రధాని మోదీ కూడా ఆదివారం జనతా కర్ఫ్యూ కు పిలుపునిచ్చారు. ఇటు అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కరోనా కట్టడికి పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. విదేశాల నుంచి వచ్చేవారు.. పొరుగు రాష్ట్రా ల్లో నుంచి వస్తున్నవారి పై నిఘా పెంచారు. కచ్చితంగా వారికి థర్మల్ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు.

ఇదిలా ఉంటే కరోన కట్టడికి ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీకి  వచ్చే వాహనాలపై నిఘా పెట్టింది. ముఖ్యంగా  ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దులో హై అలర్ట్ ప్రకటించారు. నెల్లూరు, చిత్తూరు జిల్లాల నుంచి తమిళనాడుకు కలిపి అన్ని రోడ్లను దాదాపుగా క్లోజ్ చేశారు. అనుమతులున్న, అత్యవసర వాహనాలను తప్పించి రెగ్యులర్ రవాణాను పూర్తిగా నియంత్రించారు. ఏపీ నుంచి తమిళనాడుకు వెళ్ళే వాహనాలను తమిళనాడు అధికారులు నిలువరిస్తుండగా… అటు నుంచి ఇటు వచ్చే వాహనాలను ఆంధ్ర ప్రదేశ్ అధికారులు అనుమతించడం లేదు.

కరోనా వైరస్ కలకలంతో ఆంధ్ర నుండి వచ్చే వాహనాలను వెల్లూర్ జిల్లాలో నిలిపివేశారు. ఆంధ్ర నుండి వచ్చే అన్ని ప్రైవేట్ వాహనాలను అడ్డుకుంటున్నారు. కేవలం నిత్యావసరాలకు సంబంధించిన వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. అది కూడా రాష్ట్రాల సరిహద్దులో థర్మల్ స్క్రీనింగ్ చేసి వాహనాలను పంపుతున్నారు.  తమిళనాడు నుండి తిరుపతి మీదుగా చిత్తూరు, కడప జిల్లాలకు వెళ్లే పలు రైళ్లను , బస్సులను రద్దు చేశారు . అలాగే  ఆంధ్ర నుండి తమిళనాడుకు జరిపే ప్రయాణాలను కొద్ది రోజుల పాటు రద్దు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. తమిళనాడు నుంచి వచ్చే వాహనాలను ఏపీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. విదేశాల నుంచి ఇటీవల వచ్చిన వివరాలను ప్రశ్నిస్తున్నారు.