Begin typing your search above and press return to search.

కరోనా భయంతో కోళ్లు ఫ్రీ గా ఇచ్చేస్తున్నారు ....!

By:  Tupaki Desk   |   12 March 2020 11:20 AM GMT
కరోనా భయంతో కోళ్లు ఫ్రీ గా ఇచ్చేస్తున్నారు ....!
X
కరోనా వైరస్ తో పౌల్ట్రీ పరిశ్రమ ఘోరం గా దెబ్బతింది. చికెన్ తింటే కరోనా వస్తుంది అని సోషల్ మీడియా విపరీతంగా ప్రచారం కావడంతో చికెన్ వైపు తొంగిచూసే నాధుడే కరువైయ్యాడు. ఒకప్పుడు ముక్క లేనిదే ముద్ద దిగని వారు కూడా ఇప్పుడు చికెన్ అంటే హడలిపోతున్నారు. ప్రభుత్వం ఎన్ని రకాలుగా ప్రచారం చేసి, చికెన్ తినడం వల్ల కరోనా రాదు అని చెప్తున్నప్పటికీ చికెన్ తినడానికి ప్రజలు జంకుతున్నారు. కరోనా రాకముందు కోడి కూర ధర 200 పైగా ఉండేది. కానీ ఇప్పుడు కిలో 20 కి ఇచ్చినా కూడా తీసుకునేవాడే లేడు. రేటు మరీ దారుణంగా పడిపోవడం తో పౌల్ట్రీ రంగానికి కోట్ల రూపాయల్లో నష్టం వాటిల్లుతోంది.

కొన్ని చోట్లయితే కోళ్లు పైసా విలువ చేయడం లేదు. కరోనా భయం తో ఎవ్వరూ కోళ్లను కొనకపోవడంతో పౌల్ట్రీ యజమానులు ఉచితంగా పంచిపెడుతుంటే..ఇంకొన్నిచోట్ల కోళ్లను వదిలించుకోలేక గొయ్యి తీసి సజీవంగా పాతిపెడుతున్నారు. నిన్న మొన్నటిదాకా చికెన్ అంటే పడి చచ్చిపోయే చికెన్ ప్రియులు కూడా , ఇప్పుడు చికెన్ పేరు చెప్తే భయపడిపోతున్నారు. దీంతో తెలంగాణ, ఏపీ సహా దేశవ్యాప్తంగా చికెన్‌ ధరలు మునుపెన్నడూ లేనంతగా పడిపోయాయి. తెలంగాణలోని పలుచోట్ల బ్రాయిలర్‌ కోళ్లను కిలో 11 చొప్పున కొనాలని ట్రేడర్స్‌ నిర్ణయించారు. సూర్యాపేట జిల్లాలో కిలో చికెన్‌ 20కి అమ్ముతున్నారు. దీనితో కోళ్ల దాణా ఖర్చు తట్టుకోలేక నల్గొండ జిల్లాలో ఉచితంగా జనాలకు కోళ్లను పంపిణీ చేస్తున్నారు.

కరోనా ఎఫెక్ట్‌ తో దేశవ్యాప్తంగా కోళ్ల పరిశ్రమ దాదాపు 8వేల కోట్ల వరకూ నష్టపోయినట్లు అంచనా వేస్తున్నారు. చికెన్‌ ధరలు అమాంతం పడిపోవడం తో పౌల్ట్రీ యజమానులు లబోదిబోమంటున్నారు. సాధారణంగా 45 రోజుల్లో రెండు కిలోల బరువు రాగానే కోళ్లను అమ్ముతుంటారు. అయితే కరోనా ప్రభావంతో గత రెండు నెలలుగా పౌల్ట్రీ పరిశ్రమ ఘోరంగా దెబ్బతింది. కోడికూర తింటే కరోనా వస్తుందన్న పుకార్లు జోరుగా ప్రచారం అవుతున్న క్రమలో... చికెన్ తినేందుకు ఎవరూ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. దీంతో ఫారంలోనే కోళ్లు ఉండిపోతున్నాయి. దీనితో ఎలాగోలా ఆ కోళ్ళని వదిలించుకుంటే చాలు అనుకుంటున్నారు. మొత్తంగా 2 తెలుగు రాష్ట్రాల రైతులు 2వేల కోట్ల నష్టం వచ్చినట్లు అంచనా వేస్తున్నారు. ఏదేమైనా ప్రజల్లో చికెన్ తినడం వల్ల కరోనా రాదు అని అవగాహన పెరిగితే తప్ప పౌల్ట్రీ రంగం బ్రతికి బట్ట కట్టే అవకాశం లేడు అని పౌల్ట్రీ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.