Begin typing your search above and press return to search.

కరోనా ఎఫెక్ట్ : సెలవుల్లో గవర్నర్ ...ప్రభుత్వం అసంతృప్తి !

By:  Tupaki Desk   |   17 March 2020 8:30 AM GMT
కరోనా ఎఫెక్ట్ : సెలవుల్లో గవర్నర్ ...ప్రభుత్వం అసంతృప్తి !
X
కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. కరోనా వైరస్ తో ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 162 దేశాలలో 1,82 ,609 కేసులు నమోదు కాగా..7171 మంది ప్రాణాలు విడిచారు. చైనా లో అత్యధికంగా 80 వేలకి పైగా కరోనా కేసులు నమోదు కాగా, అందులో 3226 మంది మరణించారు. ఆ తరువాత ఇటలీలో కరోనా భాదితులు ఎక్కువగా ఉన్నారు. భారత్‌లో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం ఇండియాలో 114 మంది కరోనా సోకినట్టు నిర్దారణ అయ్యింది.

దీనితో దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు పలు కీలక చర్యలు తీసుకుంటున్నాయి. అయితే, కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ సమయంలో కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మొహమ్మద్‌ ఖాన్‌ సెలవుపై వెళ్లారంటూ అధికార, ప్రతిపక్ష పార్టీలు అయన పై విమర్శలు కురిపిస్తున్నాయి. గవర్నర్ తనవెంట వ్యక్తిగత, పోలీసు, వైద్య సిబ్బందిని తీసుకెళ్లడంపై కేరళ ప్రభుత్వం అసహనం వ్యక్తం చేస్తోంది. గవర్నర్‌ కు సెక్యూరిటీ కల్పించాలనే ఉద్దేశ్యం తో నేదుమన్‌ గడ్‌ డీఎస్పీ ముఖ్యమైన కరోనా సమావేశానికి గైర్హాజరయ్యాడని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

అయితే, గవర్నర్ కి ఏ సమయంలో అయిన, ఎప్పుడైనా సెలవులు తీసుకునే హక్కు ఉంటుందని, కానీ ఇది సరియైన సమయం కాదని ఎమ్మెల్యే వీ.కె ప్రశాంత్‌ తెలిపారు. అయితే , ప్రభుత్వ , ప్రతిపక్ష ఆరోపణలపై స్పందించిన గవర్నర్‌ ఆరిఫ్‌ మొహమ్మద్‌ ఖాన్‌ .. తాను గిరిజన ప్రజల సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా అటవీ అధికారి కెఐ.ప్రదీప్ కుమార్, రేంజ్ ఆఫీసర్ పలోడ్‌ ల తో చర్చించడానికి వెళ్లానని ట్విటర్‌ లో తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో వ్యాధుల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై అధికారుల తో చర్చించామని తెలిపారు. కాగా, కేరళలో ఇప్పటి వరకు 22 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. దీనితో కేరళ కరోనా ని ఎదుర్కోవడానికి తీవ్రంగా కసరత్తులు చేస్తుంది.