Begin typing your search above and press return to search.

కరోనా ఎఫెక్ట్: అమెరికాలో భారతీయ జంట ఆత్మహత్య

By:  Tupaki Desk   |   28 April 2020 1:40 PM IST
కరోనా ఎఫెక్ట్: అమెరికాలో భారతీయ జంట ఆత్మహత్య
X
అమెరికాలోని న్యూజెర్సీలో గల జెర్సీ సిటీలో భారతీయ దంపతులు విగత జీవులుగా శవాలై కనిపించారు. వీరి మరణానికి గల అసలు కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే కరోనా ఎఫెక్ట్ తో ఉపాధి కోల్పోయి వీరు సూసైడ్ చేసుకున్నారని అనుమానిస్తున్నారు.

గరిమా కొఠారి, మన్మోహన్ మాల్ అనే భారతీయ జంట అమెరికాలోని జెర్సీ సిటీలో చాలా కాలంగా అనోన్యంగా జీవిస్తున్నారు. అయితే ఆదివారం ఉదయం 7.15 గంటలకు గరిమా తన ఇంట్లో శవంగా కనిపించింది. ఆమె ఒంటిపై బలమైన గాయాలై మరణించిందని పోలీసులు తెలిపారు. సరిగ్గా అరగంట తర్వాత దగ్గరలోని హడ్సన్ నదిలో మన్మోహన్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.

మన్మోహన్ పదేళ్ల క్రితం మాస్టర్స్ చేసేందుకు అమెరికా వచ్చినట్టు పోలీసులు చెప్పారు. కొద్ది సంవత్సరాల తర్వాత గరిమా కూడా అమెరికా వచ్చి స్థిరపడ్డారు.ఇద్దరూ పెళ్లి చేసుకొని అన్యోన్యంగా జీవిస్తున్నారు. ఇద్దరూ కలిసి ‘నుక్కడ్’ అనే పేరుతో ఓ రెస్టారెంట్ ను నడుపుతున్నారు. వీరి ఆత్మహత్యకు కారణాలపై పోలీసులు ఆరాతీస్తున్నారు.

ప్రస్తుతం కరోనా ప్రబలుతున్న వేళ వీరి రెస్టారెంట్ లాక్ డౌన్ తో మూతపడింది. దీంతో కొన్ని రోజుల క్రితం గరిమా తన ఫేస్ బుక్ లో తన రెస్టారెంట్ రీ ఓపెన్ కోసం విరాళాలు ఇవ్వాలని కోరుతూ పోస్ట్ చేసింది. వ్యాపారంలో నష్టం వచ్చిందని.. ఆదుకోండని కోరింది. కరోనాతో సంక్షోభంలో పడ్డ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి.. ఆర్థికకష్టాలు తీర్చుకోవడానికి గరిమా ఇలా కోరినట్టుగా తెలుస్తోంది. ఆర్థిక ఇబ్బందులతోనే దంపతులు ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇక మన్మోహన్ భార్యను చంపి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని అపార్ట్ మెంట్ వాసులు చెబుతున్నారు. దీంతో ప్రస్తుతానికి దీన్ని అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. వీరి మరణానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.