Begin typing your search above and press return to search.

కరోనా ఎఫెక్ట్ : టోక్యో ఒలింపిక్స్ 2020 రద్దు ఖాయమేనా ?

By:  Tupaki Desk   |   26 Feb 2020 8:45 AM GMT
కరోనా ఎఫెక్ట్ : టోక్యో ఒలింపిక్స్ 2020 రద్దు ఖాయమేనా ?
X
చైనాను వణికిస్తున్న కోవిడ్-19(కరోనా వైరస్) ప్రభావంతో పొరుగు దేశమైన జపాన్‌లో జరగాల్సిన ‘టోక్యో 2020 ఒలంపిక్స్‌’పై అనుమానాలు మొదలైయ్యాయి. ఆసియాలోని పలు దేశాలపై చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన కోవిడ్ 19 ప్రభావం చూపిస్తోంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా లక్షమందికి పైగా ఈ వైరస్ సోకగా, 2,715 మంది మృత్యువాతపడ్డారు. ఈ కరోనా వైరస్ టోక్యో ఒలంపిక్స్ పై ప్రభావం చూపిస్తుందా అంటే ? అవుననే సమాధానం వినిపిస్తుంది.

మే నెల చివరి నాటికి కొవిడ్-19 నియంత్రణలో లేనట్లయితే టోక్యో ఒలింపిక్స్ 2020ని రద్దు చేస్తామని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సీనియర్ సభ్యుడు డిక్ పౌండ్ తెలిపారు. కొవిడ్ వ్యాపిస్తున్నందున ఈ వేసవికాలంలో టోక్యోలో ఒలింపిక్స్ నిర్వహించడం చాలా ప్రమాదకరమని , ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపితే క్రీడలను పూర్తిగా రద్దు చేస్తామని డిక్ పౌండ్ చెప్పారు. ఒలింపిక్స్ వాయిదా వేయడం, లేదా మరో ప్రాంతానికి తరలించడం కంటే పూర్తిగా రద్దు చేసే అవకాశం ఎక్కువగా ఉందని ఆయన చెప్పారు.

ఇకపోతే ,రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా ఒలింపిక్స్ రద్దు చేశారు. అయితే , జికా వైరస్ వ్యాప్తి చెందినప్పటికీ బ్రెజిల్ లో రియో గేమ్స్ 2016లో షెడ్యూల్ ప్రకారం సాగింది. కొవిడ్ ప్రబలిన నేపథ్యంలో తాము ఒలింపిక్స్ నిర్వహించాలా లేదా అనే విషయాలపై తాము ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సీనియర్ సభ్యుడు డిక్ పౌండ్ వివరించారు. వారు చెప్పేదానిబట్టి ..గేమ్స్ ఉంటాయో లేదో పూర్తిగా చెప్తామని తెలిపారు. అయితే ,జులై 24 నుంచి ఆగస్టు 9 వరకు ఒలంపిక్స్ క్రీడలను నిర్వహించేందుకు టోక్యోలో అన్ని స్టేడియంలను సిద్ధం చేశారు. 56 సంవత్సరాల తర్వాత ఒలంపిక్స్‌కు ఆతిథ్యమివ్వాలని జపాన్ ఉవ్విళ్లూరుతోంది. చివరగా 1964లో ఒలంపిక్స్ గేమ్స్‌ కు జపాన్ ఆతిథ్యమిచ్చింది.