Begin typing your search above and press return to search.

కరోనా ఎఫెక్ట్.. ఖాళీ అవుతోన్న బ్లడ్ బ్యాంకులు!

By:  Tupaki Desk   |   4 May 2021 3:30 PM GMT
కరోనా ఎఫెక్ట్.. ఖాళీ అవుతోన్న బ్లడ్ బ్యాంకులు!
X
కరోనా మహమ్మారి ప్రపంచాలను వణికిస్తోంది. ఇది మానవ ఆరోగ్యంపైనే కాకుండా అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నిత్యం జరగాల్సిన ఎన్నో కార్యక్రమాలు ఆగిపోతున్నాయి. సమాజ చక్రం సజావుగా సాగకుండా ఈ మహమ్మారి అడ్డంకిగా మారింది. ఒకప్పుడు రక్త నిధి కేంద్రాల్లో రక్తం ఇవ్వడానికి యువత ఆసక్తి చూపేవారు. కొవిడ్ వల్ల రక్తదానం చేయడానికి జంకుతున్నారు. ఫలితంగా బ్లడ్ బ్యాంకుల్లో కొరత ఏర్పడింది.

రక్తం కొరత దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులైన తలసేమియా బాధితులపై తీవ్ర ప్రభావం చూపనుంది. వారికి ప్రతీ 20 రోజులకు రక్తం ఎక్కించాలి. దాత నుంచి సేకరించిన 5 రోజుల్లోపే ఇవ్వాలి. కొన్ని ముందుగా అనుకున్న ఆపరేషన్లకు రక్తం అవసరం ఉంటుంది. కొరత వల్ల అలాంటివి ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నారు వైద్యులు. ప్రమాదాల సమయంలో తీవ్ర రక్తస్రావమైతే రక్తం ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా రక్తం అవసరం చాలా ఉంటుంది. కానీ కరోనా ఎఫెక్ట్ వల్ల దాతల సంఖ్య చాలా తగ్గిపోయిందని బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులు చెబుతున్నారు.

రక్తం నిల్వలు తగ్గిపోవడం వల్ల తరుచూ శిబిరాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అయినా దాతలు పెద్దగా ముందుకు రావడం లేదని అంటున్నారు. కాలేజీలు ఉన్న సమయంలో ఓయూ దగ్గర శిబిరం ఏర్పాటు చేస్తే వంద మందికి పైగా యువత రక్తం ఇచ్చేవారని అన్నారు. కానీ ఈసారి కేవలం 15 యూనిట్లు మాత్రమే లభించిందని పేర్కొన్నారు. కరోనా భయంతో రక్తం ఇవ్వడానికి జంకుతున్నారని అన్నారు. కానీ అన్ని రకాల నిబంధనలు పాటిస్తూ ఈ క్యాంప్ నిర్వహిస్తున్నామని వివరించారు. గతేడాది లాక్ డౌన్ వల్ల రక్త నిల్వలు తగ్గిపోయాయని అన్నారు. మళ్లీ అదే పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు.

సహజంగా వేసవి కాలంలో రక్తం కొరత తక్కువగానే ఉంటుంది. ఇక ఈ విపత్కర సమయంలో చాలా ఎక్కువ కొరత ఉందని అంటున్నారు. దీనికి తోడు వ్యాక్సినేషన్. తొలి డోసు టీకా తీసుకున్న 56 రోజుల వరకు, రెండో తీసుకున్న 28 రోజుల వరకు రక్తదానం చేయకూడదని నిబంధనలు ఉన్నాయి. వైరస్ సోకితే 28 రోజులకు వరకు ఇవ్వకూడదు. ఇలాంటి కారణాలతో ఆసక్తి ఉన్నావారూ ఇవ్వలేకపోతున్నారు.

రక్తదానం చేయడానికి వచ్చిన దాతలకు కరోనా పరీక్షలు చేయడం లేదని చెప్పారు. లక్షణాలు ఉంచే మినహా ఎలాంటి పరీక్షలు నిర్వహించడం లేదని, వారి డేటాను మాత్రమే తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఎవరికైనా వైరస్ సోకిందని తెలిస్తే ఆ రక్తం ఉపయోగించడం లేదని స్పష్టం చేశారు. రక్తంతో వైరస్ సోకిన సందర్భాలు లేవని తెలిపారు. రక్తం నిల్వలు పెంచడానికి ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు అధికారులు తెలిపారు.