Begin typing your search above and press return to search.

దేవాలయాలపై కరోనా ప్రభావం

By:  Tupaki Desk   |   7 April 2021 8:30 AM GMT
దేవాలయాలపై కరోనా ప్రభావం
X
కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ప్రభావం దేవాలయాలపై చాలా తీవ్రంగానే పడినట్లుంది. మహారాష్ట్రలోని షిరిడీ దేవాలయాన్ని పూర్తిగా మూసేశారు. ఈనెల 30వ తేదీవరకు ఆలయాన్ని మూసేయాలని షిరిడీ సంస్ధాన్ ట్రస్ట్ డిసైడ్ చేసింది. కాకపోతే భక్తులు లేకుండానే నిత్యపూజలు జరుగుతాయి. ఇదే సమయంలో గతంలో ప్రారంభించిన కోవిడ్ ఆసుపత్రిని 24 గంటలు పనిచేయించాలని కూడా ట్రస్టు నిర్ణయించింది.

ఇదే సమయంలో ప్రపంచ ప్రిసిద్ధి చెందిన తిరుపతి తిరుమల దేవస్ధానం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల ఆలయంలో ఈనెల 14వ తేదీనుండి ప్రారంభించాల్సిన ఆర్జిత సేవలన్నింటినీ వాయిదా వేస్తు ట్రస్టుబోర్డు నిర్ణయించింది. మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు ప్రాంతాల్లో పెరిగిపోతున్న కరోనా వైరస్ ప్రభావం అనివార్యంగా తిరుమల మీద కనబడుతుంది. పై రాష్ట్రాల్లో కరోనా సెకెండ్ వేవ్ చాలా తీవ్రంగా ఉండటంతో భక్తుల రాక కూడా తగ్గిపోయింది.

ఇవే కాకుండా నల్గొండ జిల్లాలోని యాదాద్రి దేవాలయంలో జరుపుతున్న ఆర్జితసేవలను కూడా వారం రోజులపాటు నిలిపేశారు. కరోనా ప్రభావం చిలుకూరు బాలాజీ దేవాలయంపైన కూడా ప్రభావం చూపింది. భక్తుల తాకిడి బాగా తగ్గిపోయింది. అలాగే విజయవాడలోని ఇంద్రకీలాద్రి కొండపై వెలసిన కనకదుర్గ దేవాలయంపైన కూడా కరోనా ప్రభావం స్పష్టంగా కనబడుతోంది. 10 రోజుల క్రితం ఉన్న భక్తుల తాకిడి ఇపుడు కబనడటంలేదు.

కరోనా వైరస్ సెకెండ్ వేవ్ లో నమోదవుతున్న కేసుల సంఖ్యను చూస్తుంటే ప్రభుత్వాలే టెన్షన్ పడుతున్నాయి. గత ఏడాదిలో వచ్చిన కరోనా వైరస్ కన్నా సెకెండ్ వేవ్ మరింత ఉధృతంగా వ్యాపిస్తోంది. గతంలో దేశవ్యాప్తంగా లక్ష కేసులు నమోదవ్వటానికి దాదాపు 75 రోజులు పడితే సెకెండ్ వేవ్ లో లక్ష కేసులు కేవలం 25 రోజుల్లో నమోదవ్వటమే దీని తీవ్రతకు అద్దం పడుతోంది. తీవ్రతను అరికట్టడంలో భాగంగానే దేవాలయాల్లో ఆంక్షలు అమలు చేస్తున్నారు. మరి దీని ప్రభావం ఏ మేరకు ఉంటుందో చూడాల్సిందే.