Begin typing your search above and press return to search.

కరోనా ఎఫెక్ట్: తిరుమల శ్రీవారి దర్శనంలో మార్పులు

By:  Tupaki Desk   |   13 May 2020 3:00 PM GMT
కరోనా ఎఫెక్ట్: తిరుమల శ్రీవారి దర్శనంలో మార్పులు
X
కరోనా మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు దేశవ్యాప్తంగా మార్చి 25వ తేదీ నుండి లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రార్థనాలయాలు కూడా మూతబడ్డాయి. ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవుడు, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడి తిరుమల ద్వారాలు కూడా మూసుకున్నాయి! స్వామివారి కైంకర్యాలు యథావిధిగా జరుగుతున్నప్పటికీ భక్తులకు మాత్రం శ్రీవారి దర్శనం లేదు. క్రమంగా ఆంక్షలు ఎత్తివేస్తోంది కేంద్ర ప్రభుత్వం. లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తివేశాక భక్తులను ఎలా అనుమతించాలనే అంశంపై తిరుమల తిరుపతి దేవస్థానం సమాలోచనలు చేస్తోంది. దర్శన విధానాల్లో మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

లాక్‌డౌన్ ఎత్తివేసినప్పటికీ సామాజిక దూరం వంటివి దేశవ్యాప్తంగా పాటించాలి. ఇందుకు అనుగుణంగా తిరుమలను సిద్ధం చేస్తున్నారు. కంపార్టుమెంట్లలో గంటలతరబడి వేచి చూసే భక్తులకు టిటిడి అన్న ప్రసాద వితరణ, వైకుంఠం క్యూకాంప్లెక్స్, వసతి గృహాల్లో బస వంటి విధానాల్లో మార్పులు చోటు చేసుకోవచ్చు. దర్శనానికి వచ్చే భక్తులను నియంత్రించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా భక్తులు భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకుంటోంది టీటీడీ.

భక్తుల మీద ఒత్తిడి లేకుండా దర్శనం అమలు అంశాలను ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నారు. క్యూకాంప్లెక్స్‌ను మూసివేసి, దర్శనం తర్వాత తిరుమల నుండి కిందకు వెళ్లిపోయేలా చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది. భౌతిక దూరం పాటిస్తూ రోజుకు ఎంతమంది భక్తులను అనుమతించవచ్చుననే అంశంపై పరిశీలిస్తోంది టీటీడీ. ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలకు మాత్రమే ఇప్పటి వరకు ఆన్‌లైన్ టిక్కెట్లు విక్రయిస్తున్నారు. సర్వదర్శనానికి కూడా ఆన్‌లైన్ అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఇలా చేయడం వల్ల భక్తులు తమకు కేటాయించిన సమయానికి నేరుగా చేరుకొని శ్రీవారిని దర్శించుకోవచ్చు.