Begin typing your search above and press return to search.

కరోనా ఎఫెక్ట్: పడిపోతున్న ట్రంప్ గ్రాఫ్?

By:  Tupaki Desk   |   28 April 2020 2:40 PM IST
కరోనా ఎఫెక్ట్: పడిపోతున్న ట్రంప్ గ్రాఫ్?
X
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిదంటే ఇదే మరీ.. చైనా నుంచి ఊడిపడ్డ కరోనా వైరస్ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవికే ఎసరు పెట్టేలా కనిపిస్తోంది. త్వరలోనే అధ్యక్ష ఎన్నికలు జరగనున్న అమెరికాలో కరోనా ఎఫెక్ట్ ట్రంప్ పై తీవ్ర ప్రభావాన్ని చూపించడం ఖాయమని తేలింది.

అమెరికాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. వేగంగా వ్యాపిస్తూ లక్షల మంది ప్రాణాలు తీస్తోంది. కరోనా కట్టడిలో ట్రంప్ పనితీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆయన నిర్లక్ష్యం కారణంగానే అమెరికాలో కరోనా కేసులు పెరిగాయని.. లాక్ డౌన్ విధించకుండా ఆయన తప్పు చేశారని అంటున్నారు. కేవలం ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని ప్రజల ప్రాణాలను ట్రంప్ బలిపెట్టాడనే ప్రచారం ప్రతిపక్షాలు చేస్తున్నాయి.

ఈ క్రమంలోనే ట్రంప్ గ్రాఫ్ క్రమక్రమంగా పడిపోతోందని తేలింది. ఇదే సమయంలో ఈయనకు ప్రధాన పోటీదారు అయిన డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ కు మద్దతు పెరుగుతోంది. తాజాగా అక్కడ నిర్వహించిన నేషనల్ పోల్ లో ట్రంప్ కంటే బైడెన్ ఏకంగా ఆరు పాయింట్ల ఆధిక్యం చూపారు. దాంతో ప్రజలు ఆయన వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

‘యూఎస్ఏ టుడే-సఫ్లోక్ యూనివర్సిటీ పోల్’లో పాల్గొన్న వారిలో 42శాతం మంది అమెరికా అధ్యక్ష రేసులో జోబైడెన్ కు ఓటు వేశారు. ఇక ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ వైపు కేవలం 36శాతం మంది మాత్రమే మొగ్గు చూపారు. ఇద్దరి మధ్య దూరం ఎక్కువగా ఉంది.

అయితే బలమైన నాయకత్వం విషయంలో అమెరికన్లు ఇద్దరినీ పరిగణలోకి తీసుకోలేదు. ఇద్దరికీ 50శాతం మించి ఓట్లు రాకపోవడంతో వీరిద్దరినీ రిజెక్ట్ చేసిన వారు కూడా ఎక్కువగా ఉన్నారని తెలుస్తోంది.