Begin typing your search above and press return to search.

కరోనా ఎఫెక్ట్ : ఉచితంగా శ్రీవారి లడ్డూలు ...!

By:  Tupaki Desk   |   21 March 2020 10:43 AM GMT
కరోనా ఎఫెక్ట్ : ఉచితంగా శ్రీవారి లడ్డూలు ...!
X
కరోనా వైరస్ ప్రభావం చివరికి ఆ శ్రీవారిని కూడా వదలలేదు. కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుండటం తో తిరుమలలో స్వామి వారి దర్శనాలని నిలిపివేశారు. దర్శనానికి భక్తులను అనుమతించడం లేదు. అలిపిరి, శ్రీవారి మెట్ల మార్గాలను పూర్తిగా మూసివేశారు. తిరుమల గిరులు భక్తులు లేక వెలవెలబోతోంది. ఇక స్వామివారికి రోజు వారి ఆరు కైంకర్యాలు మాత్రం యధావిధిగా కొనసాగుతున్నాయి. దీనితో ఇప్పటివరకు ఎన్నడూ లేని విధంగా తిరుమలకు కళ తప్పింది. ప్రజల ఆరోగ్యం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని టీటీడీ తెలిపింది. దీనికి శ్రీవారి భక్తులందరూ సహకరించాలని విజ్ఞప్తి చేసింది. గ్రహణాల సమయంలో ప్రధాన ఆలయాన్ని మూసివేసినప్పటికీ..అలిపిరి , శ్రీవారి పాదాల నడక మార్గాన్ని మాత్రం ఇప్పటి వరకూ మూసివేయలేదు.

తిరుమలకి భక్తులని రాకుండా నిలిపివేయడంతో శ్రీవారి ప్రసాదం అయిన లడ్డూలు భారీగా మిగిలిపోయాయి. ఏకంగా 2 లక్షల వరకు లడ్డూలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. దీంతో వాటిని ఉచితంగా పంపిణీ చేయాలని టీటీడీ నిర్ణయించింది. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం దగ్గర శనివారం (మార్చి 21,2020) ఉగాది కానుకగా టీటీడీ ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులకు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించారు. సాధారణంగా తిరుమల లడ్డూలకు ఉండే స్పెషల్ డిమాండ్‌ దృష్ట్యా అదనంగా లడ్డూలు తయారు చేస్తుంటారు. ఎన్ని లడ్డులూ చేసినా కూడా తక్కువే అవుతుంటాయి. అలాంటింది కానీ కరోనా ఎఫెక్ట్‌ తో శ్రీవారి దర్శనాలు నిలిపివేయడంతో లడ్డులూ మిగిలిపోయాయి.