Begin typing your search above and press return to search.

అమెరికాలో కరోనా కల్లోలం.. రోజుకు లక్ష కేసులు

By:  Tupaki Desk   |   7 Aug 2021 7:01 AM GMT
అమెరికాలో కరోనా కల్లోలం.. రోజుకు లక్ష కేసులు
X
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కరోనా కల్లోలం సృష్టిస్తోంది. అక్కడ గురువారం రోజు వారి కేసులు భారీగా పెరుగుతున్నాయి. గురువారం ఒక్కరోజే ఏకంగా 1,09,824 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకావడం కలకలం రేపుతోంది.గడిచిన వారం రోజుల్లో అమెరికాలో సగటున రోజుకు 98518 కరోనా కేసులు నమోదైనట్టు అధికారులు చెప్తున్నారు. వారం రోజులుగా రోజుకు సుమారు లక్ష కరోనా కేసులు రికార్డు అయ్యాయి. మూడు వారాల క్రితంతో పోల్చుకుంటే ఈ కరోనా కేసులు 277శాతం పెరుగుదల కనిపిస్తోంది.

ఫిబ్రవరి 14 నుంచి ఇంతలా కరోనా కేసులు పెరగడం ఇదే తొలిసారి. కరోనా మరణాలు కూడా చాలా వేగంగా పెరుగుతున్నాయి. గురువారం కొత్తగా 535 కరోనా మరణాలు నమోదయ్యాయి. గడిచిన వారం రోజుల్లో సగటున 426 కరోనా మరణాలు నమోదైనట్టు గణాంకాలు చెప్తున్నాయి. ఇది మూడు వారాల క్రితంతో పోల్చుకుంటే 58శాతం ఎక్కువని అధికారులు చెప్తున్నారు.

ఇక అమెరికాలో ఈ కరోనా కల్లోలానికి కారణం డెల్టా వేరియంట్ గా చెబుతున్నారు. కరోనా కేసుల్లో 93శాతం డెల్టా వేరియంట్ వల్లే అని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) చెబుతోంది. దీనిపై సీడీసీ డైరెక్టర్ డాక్టర్ రోషెల్ వెలెన్ స్కీ మాట్లాడారు. కరోనా వ్యాక్సిన్లు పనిచేసినప్పటికీ ఇవి వైరస్ వ్యాప్తిని నిరోధించలేకపోతున్నాయని చెప్పారు.

కరోనా ప్రబలిన కొత్తలో అమెరికా అల్లకల్లోలమైంది. అత్యధిక కేసులు, మరణాలతో వణికిపోయింది. డొనాల్డ్ ట్రంప్ నిర్లక్ష్యం వల్ల కూడా ఈ ఉపద్రవం ఏర్పడింది. వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో అక్కడి ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే తాజాగా మరోసారి రోజువారీ కేసులు పెరుగుతున్నాయి.

డెల్టా వేరియంట్ విజృంభిస్తుండడంతో న్యూయార్క్ లాస్ ఏంజిల్స్ సహా కొన్ని కీలక ప్రాంతాల్లో మరోసారి ఆంక్షలు విధించారు. గతవారం సగటున రోజుకు 90వేల కేసులు వెలుగులోకి వచ్చాయి. అంతకు క్రితం వారితో పోలిస్తే కొత్త కేసులు ఏకంగా 43శాతం ఎగబాకాయి. దీంతో ఆస్పత్రులకు తాకిడీ పెరిగింది.

ఈ క్రమంలోనే అమెరికాలోని జోబైడెన్ సర్కార్ సీడీసీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. గత ఏడు రోజుల సగటు వ్యాక్సినేషన్ క్రితం వారంతో పోలిస్తే 11శాతం .. గత రెండు వారాలతో పోలిస్తే 44శాతం పెరిగినట్లు అధికారులు తెలిపారు.