Begin typing your search above and press return to search.

తమిళనాడులో కరోనా కల్లోలం: వేలూరులోని మెడికల్ కాలేజీ 200మందికి పాజిటివ్

By:  Tupaki Desk   |   10 Jan 2022 3:28 PM GMT
తమిళనాడులో కరోనా కల్లోలం: వేలూరులోని మెడికల్ కాలేజీ 200మందికి పాజిటివ్
X
తమిళనాడు రాష్ట్రంలో కరోనా బీభత్సం సృష్టిస్తోంది. రోజురోజుకు కేసులు పెరుగుతున్న తీరు రాష్ట్రంలో ఆందోళనకరంగా తయారైంది. తాజాగా వేలూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజ్(సీఎంసీ) హాస్పిటల్ లో 200మందికి పైగా వైద్యసిబ్బందికి కోవిడ్-19 పాజిటివ్ అని తేలిందని కార్పొరేషన్ అధికారి తెలిపారు.

ఆరోగ్య కార్యకర్తలు గత వారం రోజులుగా కరోనా పాజిటివ్ బారిన పడుతున్నారని.. ఆస్పత్రి యాజమాన్యం వ్యాప్తిని నియంత్రించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటోందని వెల్లూర్ కార్పొరేషన్ సిటీ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ టి. మణివన్నన్ పేర్కొన్నారు. కరోనా మహమ్మారి బారినపడిన ఆరోగ్య కార్యకర్తల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అయితే వారంతా తేలికపాటి లక్షణాలతో ఇబ్బంది పడుతున్నారని ఆయన వెల్లడించారు.ఇక వీరి కోసం ప్రత్యేకమైన కోవిడ్ వార్డును ఏర్పాటు చేసినట్లుగా ఆయన తెలిపారు.

ఆస్పత్రిలో 2000 మంది వైద్యులు సహా 10,500 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. దేశవ్యాప్తంగా బంగ్లాదేశ్ వంటి పొరుగుదేశాల నుంచి కూడా రోగులు సాధారణంగా చికిత్స కోసం వేలూరు ఆస్పత్రికి వస్తుంటారు. వేలూరు ఆస్పత్రిలో వైద్యసిబ్బందికి కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆస్పత్రిలో ఎమర్జెన్సీ కాని వైద్యసేవలను నిలిపివేశారు.

సాధారణ వైద్యసేవలను నిలిపివేశారు. ఎమర్జెన్సీ కాని వైద్యచికిత్సలు, ఔట్ పేషెంట్(ఓపీ) సందర్శనలు, ఇతర అత్యవసర చికిత్సలు, శస్త్రచికిత్సల కోసం ఆన్ లైన్ బుకింగ్ తాత్కాలికంగా నిలిపివేయబడిందని సమాచారం.

వేలూరు ఆస్పత్రిలో అత్యవసర చికిత్సలు మాత్రమే అందిస్తున్నారు. వేలూరు సిటీ మునిసిపల్ కార్పొరేషన్ శుక్రవారం సీఎంసీ సమీపంలోని బాబూరావు వీధిని ‘కంటైన్ మెంట్ జోన్’గా ప్రకటించింది. అక్కడ ఆరుగురు సభ్యులకు వారి బంధువులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అవడంతో కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించింది.

ఇక తాజాగా కోవిడ్19 ఇన్ ఫెక్షన్ లు తమిళనాడులో 10 వేల మార్కును దాటాయి. వీటిలో దాదాపు 46శాతం చెన్నైలో నివేదించబడ్డాయి. రాష్ట్రంలో మొత్తం తాజాగా 10978 మందికి పరీక్షలు చేయగా.. 2వేల కేసులు బయటపడ్డాయి. పాజిటివిటీ రేటు 7.9 శాతానికి పెరిగింది.