Begin typing your search above and press return to search.

భారత్ లో కరోనా కల్లోలం: ఒక్కరోజులో 1.59 లక్షలకు పైగా కేసులు

By:  Tupaki Desk   |   9 Jan 2022 6:44 AM GMT
భారత్ లో కరోనా కల్లోలం: ఒక్కరోజులో 1.59 లక్షలకు పైగా కేసులు
X
భారత్ లో కరోనా కల్లోలం మళ్లీ మొదలైంది. ఒక్కరోజులోనే ఏకంగా 1.59 లక్షల కేసులు నమోదయ్యాయి. భారత్ లో దీన్ని బట్టి కరోనా థర్డ్ వేవ్ వచ్చేస్తుందా? అన్న భయాలు నెలకొన్నాయి. వరుసగా భారీగా పెరుగుతున్న కొత్త కేసులు చూస్తుంటే అలాగే అనిపించకమానదు..

గత ఐదు రోజులుగా దేశంలో భారీగా కేసులు పెరుగుతున్నారు. ప్రతీరోజు రెట్టింపు అవుతున్నాయి. కరోనా మీటర్ జెట్ స్పీడుతో పరిగెడుతోంది. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజాగా బులిటెన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1,59,632 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 327 మంది కోవిడ్ బాధితులు కన్నుమూశారు. ఇదే సమయంలో 40863 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్లు బులిటెన్ లో కేంద్రం పేర్కొంది.

ప్రస్తుతం భారత్ లో కోవిడ్ కేసులు పాజిటివిటీ రేటు 10.21 శాతానికి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకూ మహమ్మారి బారినపడి మృతిచెందిన వారి సంఖ్య 4,83,790కు పెరగగా.. కోలుకున్న వారి సంఖ్య 3,44,53,603గా ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5,90,611 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులిటెన్ లో కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది.

దేశంలో పాజిటివిటీ రేటు ఏకంగా 10.21 శాతానికి చేరడం ఆందోళన కలిగిస్తోంది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. మహారాష్ట్ర, ఢిల్లీ,కర్ణాటక, రాజస్థాన్ లలో కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. ఇక ప్రభుత్వం వ్యాక్సినేషన్ ను వేగవంతం చేసింది. ఏకంగా నిన్న ఒక్కరోజే 89 లక్షల టీకాలు వేసింది. ఇప్పటివరకూ 151 కోట్ల డోసులు పంపిణీ చేసింది. రెండు కోట్లకు పైగా టీనేజర్లు టీకా తీసుకున్నారు.

మరోవైపు దేశంలో ఒమిక్రాన్ కేసులు కూడా జెట్ స్పీడుగా పెరిగిపోతున్నాయి.ఇప్పటికే 27 రాష్ట్రాలను ఒమిక్రాన్ చుట్టేసింది. ఇప్పటివరకూ నమోదైన ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య 3623కు చేరింది. దీంతో దేశంలో మరోసారి థర్డ్ వేవ్ ఖాయమా? అన్న భయాలు నెలకొంటున్నాయి.