Begin typing your search above and press return to search.

వామ్మో ఆ రాష్ట్రాల్లో కరోనా.. మనమూ జాగ్రత్తగా ఉండాలట

By:  Tupaki Desk   |   9 April 2022 6:31 AM GMT
వామ్మో ఆ రాష్ట్రాల్లో కరోనా.. మనమూ జాగ్రత్తగా ఉండాలట
X
చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి తన రూపం మార్చుకుని ప్రజల పై పడగ విప్పి బుస కొడుతూనే ఉంది. రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ.. ఆ మహమ్మారి అంతం కాలేదు. అయితే తాజాగా కొత్త వేరియంట్ తో చైనా, అమెరికా వంటి దేశాలను వణికిస్తున్న కరోనా.. మన దేశం లోకి కూడా వచ్చేసింది. అయితే కరోనా కొత్త వేరియంట్ అయిన "XE" వ్యాప్తి వేగంగా ఉందంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన మేరకు చాలా దేశాలు కట్టడి చర్యలు తీసుకుంటున్నాయి.

ఇక భారత్ లోనూ "XE"వేరియంట్ బయటపడిన నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్ర వైద్యారోగ్య శాఖ... ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా నాలుగో దశ ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయని అందుకు తగ్గట్టుగా ముందస్తు నియంత్రణ చర్యలు తీసుకోవాలని కేంద్రం హెచ్చరించింది. ఇప్పటికే ఢిల్లీ, హర్యానా, కేరళ, మహారాష్ట్ర, మిజోరం వంటి రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరిగాయి.

ఆయా రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తుండటంతో... ఆందోళన వ్యక్తం చేసిన కేంద్ర ప్రభుత్వం ఆయా ప్రభుత్వాలు గట్టి నిఘా పెట్టాలని సూచించారు. అవసరమైతే ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఆ మేరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ ఆయా రాష్ట్రాల ఆరోగ్య కార్యదర్శులకు లేఖలు రాశారు. కరోనా నాలుగో దశ వ్యాప్తి నివారణలో భాగంగా మూడో డోస్ టీకా పై శుక్రవారం కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది.

ఏప్రిల్ 10వ తేదీ అంటే రేపటి నుంచి ప్రైవేట్ టీకా కేంద్రాలలో 18 ఏళ్లు నిండిన వారందరికీ ప్రికాషన్స్ డోస్ అందుబాటులో ఉంటుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అర్హులందరూ రెండు డోసులు తీసుకున్న 9 నెలల తర్వాత బూస్టర్ డోస్ తీసుకోవాలని వివరించింది. అంతే కాకుండా దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ఊహించిన దాని కంటే వేగంగా జరుగుతున్నట్లు తెలిపారు.

ఇప్పటికే దేశంలో 15 ఏళ్ల ఆపై వయసున్న 96 శాతం మంది మొదటి డోసు టీకాలు తీసుకున్నారని స్పష్టం చేసింది. అలాగే రెండు డోసులు తీసుకున్న వారు 83 శాతం ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. కరోనా మరోసారి వ్యాపిస్తున్న నేపథ్యంలో అర్హులంతా బూస్టర్ డోస్ తీసుకోవాలని సూచించింది.

కరోనా టీకానే మనకు శ్రీరామరక్ష అని వివరించింది. కొవిడ్ రెండు డోసుల టీకా, బూస్టర్ డోస్ తీసుకుంటే మాస్క్ ధరించాల్సిన అవసరం అంతగా రాకపోవచ్చని కూడా వివరించారు. కాబట్టి అర్హులంతా కచ్చితంగా బూస్టర్ డోస్ తీసుకొని కరోనా మహమ్మారి కి దూరంగా ఉండండి.