Begin typing your search above and press return to search.

కరోనా సోకినా వదలట్లేదు.. ప్రైవేట్ ఆసుపత్రుల తీరు ఇక మారదా !

By:  Tupaki Desk   |   21 July 2020 11:10 AM GMT
కరోనా సోకినా వదలట్లేదు.. ప్రైవేట్ ఆసుపత్రుల తీరు ఇక మారదా !
X
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనాను ఎదుర్కొనేందుకు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సేవలు అందిస్తున్నారు వైద్యులు, వైద్య సిబ్బంది. ఈ క్రమంలో ఈ వైరస్ బారిన పడిన పలువురు డాక్టర్లు, నర్సులు మృత్యువాత కూడా పడ్డారు. అయితే , తాజాగా తెలంగాణ హైదరాబాద్ లో కరోనా సోకిన నర్సులకి ఆసుపత్రి యాజమాన్యం సెలవులు ఇచ్చి క్వారంటైన్ లో ఉండాలని చెప్పాల్సిందిపోయి ..వారితో కూడా పనిచేయించింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో కరోనా సోకిన నర్సులతో పనిచేయించడంపై తెలంగాణ మానవహక్కుల కమిషన్‌ (హెచ్చార్సీ) ఆ ఆసుపత్రి యాజమాన్యం పై ఆగ్రహం వ్యక్తం చేసింది.

నర్సులను బలవంతంగా నిర్బంధించి పనిచేయించడమేంటని ప్రశ్నించింది. హెచ్ఆర్సీ భాదితులని వెంటనే కలవాలని వారి సమస్యలను పరిష్కరించాలని హైదరాబాద్ డీఎంహెచ్ ఓ తో పాటు వెస్ట్ జోన్ డీసీపీ కి నోటీసులు జారీ చేసింది. బాధిత నర్సులను తక్షణమే కలవాలని, వారి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించింది. ఈ ఘటనపై అయిదు రోజుల్లోగా తమకు నివేదిక సమర్పించాలని ఆదేశించింది. కాగా, నర్సులను వేధించిన ప్రైవేట్‌ ఆస్పత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోస్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

ఇకపోతే , తెలంగాణలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1,198 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. హైదరాబాద్ ‌లో 510 మందికి కరోనా పాజిటివ్‌ గా నిర్దారణ కాగా.. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 46,274కి చేరింది. ఇందులో 11,530 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే, రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 422కి చేరింది.