Begin typing your search above and press return to search.

కరోనా, లాక్డౌన్ ఎఫెక్ట్: మహిళల్లో మానసిక రుగ్మతలు

By:  Tupaki Desk   |   6 Sep 2020 10:00 AM GMT
కరోనా, లాక్డౌన్ ఎఫెక్ట్: మహిళల్లో మానసిక రుగ్మతలు
X
కరోనా మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు ప్రపంచంలోనే అతిపెద్ద లాక్డౌన్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. లాక్డౌన్ వల్ల ఎన్నో ప్రాణాలు కాపాడినట్లయింది. కరోనాకు ముందు మహిళలు, పురుషులు కుటుంబంతో లేదా స్నేహితులతో కలిసి నెలకు ఒకటి లేదా రెండుసార్లు సినిమాకో, షికారుకో, రెస్టారెంట్‌కు వెళ్లేవారు. కొన్నిసార్లు బయట పర్యటించేవారు. అలా బయటకు వెళ్లి కాస్త రిలీఫ్‌గా ఫీలయ్యేవారు. లాక్డౌన్ ప్రారంభమయ్యాక ఇంటికే పరిమితమయ్యారు. ఆరు నెలలుగా బయటకు వెళ్లడం ఆగిపోయింది. లాక్డౌన్ ఇళ్లకు పరిమితం చేసింది. ఇప్పుడు కూడా బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి. తప్పనిసరి పరిస్థితుల్లోనే వెళ్తున్నారు. లేకుంటే ఇంటికే పరిమితమవుతున్నారు.

మొదట ఇది ఇంట్లోనే ఉండే మహిళలకు సమస్యగా అనిపించలేదు. ఎందుకంటే కుటుంబమంతా ఇంట్లోనే ఉండటంతో వారితో ఎక్కువసేపు గడిపేందుకు సమయం చిక్కిందని ఆనందించారు. కొత్త వంటకాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపించారు. కానీ నెమ్మదిగా ఈ ఆనందం క్షీణిస్తోంది. ప్రధానంగా ఉద్యోగం లేకుండా ఉన్న మహిళల్లో మానసిక ఒత్తిడి పెరుగుతోంది. ఉద్యోగం ఉన్నవారు పురుషుల్లాగే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. కానీ ఉద్యోగం లేని వారు ఇప్పుడు ఇబ్బందిపడుతున్నారట. ముఖ్యంగా హైదరాబాద్, ముంబై, చెన్నై, బెంగళూరులలో ఇది ఎక్కువగా కనిపిస్తోందని సైక్రియాట్రిస్ట్ చెబుతున్నారు.

పట్టణాలు, గ్రామాల్లో పోల్చిచూసినప్పుడు నగరాల్లో ఈ పరిస్థితి చాలా ఎక్కువగా ఉందని చెన్నైకి చెందిన సైక్రియాట్రిస్ట్ డాక్టర్ అరుణ్ కుమార్ చెబుతున్నారు. ఎప్పుడు సమాజంలో ఉంటూ వస్తున్న నగరమహిళలపై మానసిక రుగ్మత ఎక్కువగా ఉందని చెబుతున్నారు. ఇదివరకు హాజరైనట్లుగా వివాహ కార్యక్రమాలకు హాజరు కావడంలేదు. కానీ మానసికంగా ఒత్తిడికి సంబంధించిన కేసులు మాత్రం పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తమ వద్దకు వచ్చిన వారికి మెడిసిన్స్ ఇస్తున్నామని, మరికొంతమందికి ఏరోబిక్స్ వంటి జీవనశైలి మార్పులను సూచిస్తున్నామని డాక్టర్ అరుణ్ కుమార్ చెప్పారు.

కొంతమంది మహిళలు కరోనా తమకూ వస్తుందేమోనని భయపడుతున్నారు. జాగ్రత్తలు తీసుకుంటే కరోనా రాదని తెలిసినప్పటికీ ఒత్తిడికి గురవుతున్నారు. కరోనా కేసుల్లో 98 శాతం ప్రాణాంతకం కాదని, 2 శాతం మాత్రమే ఈ కేటగిరీలో ఉంటాయని తెలిసినప్పటికీ తమకు ఏమవుతుందోనని భయపడుతున్నారట. ఆందోళన రుగ్మతలకు వివిధ రకాల కారణాలు ఉంటాయని, హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కోవిడ్‌తో పోరాడిన, ఏ లక్షణాలు లేకుండా బయటపడిన మహిళల్లోను వివిధ రకాల ఆందోళనలు పెరుగుతున్నాయని, 2019 నాటి సాధారణ పరిస్థితికి వస్తే రకరకాల ఆందోళనలు, ప్రశ్నలు వారిలో తలెత్తవన్నారు. ఇలా జరగాలంటే కరోనా వ్యాక్సీన్ లేదా కరోనా పూర్తిగా తగ్గిన తర్వాతే సాధ్యం అంటున్నారు.

తాత్కాలిక మానసిక రుగ్మతల నుండి బయటపడేందుకు ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయం మంచి పరిష్కారమని సూచిస్తున్నారు.