Begin typing your search above and press return to search.

ఊబకాయుల్లో కరోనా తిష్ఠ.. ఎలా తరిమికొట్టాలి?

By:  Tupaki Desk   |   21 Jan 2022 11:30 AM GMT
ఊబకాయుల్లో కరోనా తిష్ఠ.. ఎలా తరిమికొట్టాలి?
X
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. దాదాపు అన్ని దేశాల్లోనూ విశ్వరూపం చూపిస్తోంది. దక్షిణాఫ్రికాలో పుట్టిన ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా ఇటీవల పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అయితే వైరస్ ఎవరిపై ఎక్కువగా ప్రభావం చూపిస్తుందని అంశంపై వైద్యారోగ్య నిపుణులు అధ్యయనాలు చేస్తున్నారు. కాగా వైరస్ భారీకాయుల శరీరంలో తిష్ఠ వేస్తోందని వారి పరిశోధనల్లో తేలింది. అశ్రద్ధ చేస్తే అంతే సంగతులని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఊబకాయుల శరీరంలో కొవ్వు పేరుకుపోయి ఉంటుంది. సహజంగా ఈ చెడు కొవ్వు వల్ల అనేక ఇతర అనారోగ్య సమస్యలు ఉంటాయి. అయితే అది కరోనా వైరస్ కు ప్లస్ పాయింట్ గా మారే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. భారీకాయుల శరీరంలో వైరస్ ఎక్కువ కాలం ఉంటుందని తేలిందని పరిశోధకులు వెల్లడించారు. వారిలో యాంజియోటెన్సిన్-కన్వర్టింగ్ ఎంజైమ్ టైప్-2 ఊపిరితిత్తుల కణాల్లో పెరుగుతుందని చెప్పారు. ఇది వైరస్ కు అనుకూలంగా ఉండేలా చేస్తుందని గుర్తించారు. అంతేకాకుండా రోగ నిరోధక శక్తిపై కూడా ప్రభావం చూపుతుందని అన్నారు.

అంతేకాకుండా స్థూలకాయుల్లో పొట్టభాగంలో కొవ్వు పేరుకుపోయి ఉంటుంది. ఫలితంగా ఊపిరితిత్తులపై అధిక ఒత్తిడి పడుతుంది. వాటి పనితీరు కూడా మందగిస్తుంది. ఈ నేపథ్యంలో అనేక ఇతర ఇన్ఫెక్షన్లకు గురయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఇటువంటి సమయంలో వైరస్ కూడా తోడైతే ప్రమాదం తీవ్రస్థాయిలో ఉంటుందని వైద్యారోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఊబకాయులపై కరోనా వైరస్ మాత్రమే కాదని.. ఇతర ఇన్ ఫ్లూయెంజాలు సోకే సమయంలోనూ బాధితులకు ఐసీయూ చికిత్సలు అవసరమయ్యాయని గుర్తు చేశారు. ఊబకాయులు వైరస్ పట్ల చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెబుతున్నారు.

శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వు వైరస్ గా ఆశ్రయంలాగా మారుతుంది. మహమ్మారి ఆ కొవ్వుపై దాడి చేస్తుంది. కొవ్వు కణాలు చచ్చిపోతే శరీరంలో అసమతుల్యత ఏర్పడుతుంది. ఆహార సరఫరా నిలిచిపోతుంది. తద్వారా అన్ని జీవక్రియలు దెబ్బతింటాయి. అంతేకాకుండా ఊబకాయుల్లో వైరస్ లక్షణాలు కూడా అధికంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వీరు వైరస్ బారిన పడితే ఆస్పత్రిలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ఊబకాయులైన పురుషులు, స్త్రీలకు కూడా ప్రమాదం ఉంటుందని అంటున్నారు. 55 ఏళ్లు పైబడిన వృద్ధులైన అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

కాబట్టి శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించేందుకు సరైన ఆహార నియమాలు పాటించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా వ్యాయామం, యోగా వంటివి చేయాలని సూచిస్తున్నారు. తద్వారా కరోనా మహమ్మారినే కాదు ఊబకాయం మహమ్మారిని తొలగించవచ్చునని అభిప్రాయపడుతున్నారు. ఇక నుంచైనా మంచి ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలని సూచిస్తున్నారు.