Begin typing your search above and press return to search.

మహమ్మారి కొత్త వేరియంట్.. ఎక్కడ బయటపడిదంటే?

By:  Tupaki Desk   |   26 Nov 2021 4:15 AM GMT
మహమ్మారి కొత్త వేరియంట్.. ఎక్కడ బయటపడిదంటే?
X
మిగిలిన ప్రపంచాన్ని వదిలేస్తే.. కరోనా మహమ్మారికి సంబంధించిన భయాల్ని భారతీయులు అధిగమించారనే చెప్పాలి. మే.. జూన్ రెండు నెల్లలో భారత్ ను ఒక ఊపు ఊపేసిన సెకండ్ వేవ్ తాకిడికి ఎంతలా విలవిలలాడారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కంటికి కనిపించని ఈ వైరస్ దెబ్బకు భారత్ కుదేలైంది. జూన్ మధ్య నుంచి కేసులు తగ్గటం మొదలై.. ఇప్పుడు నామమాత్రంగానే ఉండటం తెలిసిందే.

పెద్ద ఎత్తున సాగిన వ్యాక్సినేషన్ కారణంగా కేసుల తీవ్రత తగ్గిందన్న మాట వినిపిస్తున్న వేళ.. ముప్పు ఇంకా తప్పలేదని.. పొంచి ఉందన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. అయితే.. కరోనా భయం నుంచి భారతీయులు దాదాపు బయటకు వచ్చేసినట్లేనని చెప్పాలి.

ఇదిలా ఉంటే.. యూరప్ లోని పలు దేశాలతో పాటు.. మరికొన్ని దేశాల్లో కరోనా తీవ్రత భారీగా ఉంది. కొన్ని దేశాల్లో ప్రస్తుత పరిస్థితి దారుణంగా ఉందన్న వార్తలు వస్తున్నాయి. ఇలాంటివేళ.. మరో షాకింగ్ నిజం బయటకు వచ్చింది. కరోనా ఖతమైనట్లే అని ఫీలయ్యే వారంతా ఒక్కసారి అలెర్టు అయ్యే ఈ సమాచారాన్ని చూస్తే.. తాజాగా కరోనాలో సరికొత్త వేరియంట్ ను గుర్తించారు.

ఈ కొత్త వేరియంట్ అత్యంత ప్రమాదకారిగా అభివర్ణిస్తున్నారు.వైరస్ ఎప్పటికప్పుడు తన తీరును మార్చుకుంటే.. కొత్త వేరియంట్ గా మారటం తెలిసిందే. తాజాగా గుర్తించిన ఈ వేరియంట్ కు బి.1.1.529గా నిర్ధారించారు. దక్షిణాఫ్రికాలో దాదాపు 100నమూనాల్లో ఈ కొత్త వేరియంట్ ను గుర్తించారు. బోట్స్ వానా.. హాంగ్ కాంగ్ లోనూ దీన్ని గుర్తించినట్లుగా చెబుతున్నారు.

దక్షిణాఫ్రికా నుంచి వెళ్లిన ఒక ప్రయాణికుడి కారణంగా హాంకాంగ్ లో ఈ వేరియంట్ వెలుగు చూసిందని తెలుస్తోంది. దక్షిణాఫ్రికాలోని గౌటెంగ్ ప్రాంతంలో వెలుగు చూస్తున్న కేసుల్లో 90 శాతం కేసులు ఈ కొత్త వేరియంట్ కావొచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ కొత్త వేరియంట్ కు సంబంధించిన సమాచారం చాలా పరిమితంగానే ఉందని.. దీన్ని మరింతగా అర్థం చేసుకోవటానికి సైంటిస్టులు ప్రయత్నిస్తున్నట్లుగా చెబుతున్నారు.

గత సంవత్సరం బీటీ వేరియంట్ ను సైతం దక్షిణాఫ్రికాలోనే గుర్తించారు. ఈ కొత్త వేరియంట్.. శరీర రోగ నిరోధక ప్రతిస్పందన నుంచి తప్పించుకోవటంతో పాటు మరింతగా వ్యాప్తి చెందే సామర్థ్యం ఉన్నట్లుగా గుర్తించారు. దక్షిణాఫ్రికాలో అత్యధిక జనాభా ఉన్న గౌటెంగ్ ప్రావిన్స్ (మనం రాష్ట్రాలుగా పిలుచుకుంటాం) ఈ వేరియంట్ బలపడుతోంది.

దీని తీరుపై చర్చించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ శుక్రవారం ఒకప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా దక్షిణాఫ్రికాను అభ్యర్థించింది. కరోనా ప్రమాదం ప్రపంచానికి ఇంకా పొంచి ఉందన్న విషయం తాజా వేరియంట్ మరోసారి గుర్తుచేస్తుందని చెప్పాలి. ఇప్పుడు అందుబాటులోఉన్న వ్యాక్సిన్.. కొత్త వేరియంట్ మీద ఎంత ప్రభావాన్ని చూపుతుందన్నది అసలు ప్రశ్నగా చెప్పక తప్పదు.