Begin typing your search above and press return to search.

కరోనా కొత్త వేరియంట్.. పిల్లలనే టార్గెట్ చేసిందా?

By:  Tupaki Desk   |   30 March 2021 10:00 AM IST
కరోనా కొత్త వేరియంట్.. పిల్లలనే టార్గెట్ చేసిందా?
X
దేశవ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తోంది. గతేడాది మొదలైన మహమ్మారి విజృంభణ ఇంకా కొనసాగుతూనే ఉంది. మధ్యలో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గినట్లే తగ్గినా... మార్చి నంచి మళ్లీ కోరలు చాస్తోంది. బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇక ఈ సెకండ్ వేవ్ లో పాజిటివ్ కేసుల్లో పిల్లలే అధిక సంఖ్యలో ఉంటున్నారు. పాఠశాలల్లోని చిన్నారులపై మహమ్మారి పంజా విసిరింది. ఫలితంగా పదుల సంఖ్యలో విద్యార్థులు వైరస్ బారిన పడ్డారు. వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం, అధికారులు పాఠశాలలను తాత్కాలికంగా మూసేశారు.

ఏడాది గడవడంతో తల్లిదండ్రుల్లో కాస్త భయం తగ్గి పిల్లలతో కలిసి బయట తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో చిన్నారులపై మహమ్మరి విశ్వరూపం చూపిస్తోంది. రెండో దశలో అధికంగా నమోదవుతున్న కేసుల్లో చిన్నారులే ఎక్కువగా ఉన్నారు. ఈ నెల తొలి వారంలో తక్కువగా ఉన్న కేసులు రెండో వారం నుంచి రెట్టింపు అయ్యాయి. అందులో చిన్నారులే ఎక్కువగా వైరస్ బారిన పడ్డారు. బెంగుళూరులో మార్చి 1 నుంచి పదిళ్లలోపు పిల్లల్లో 472 మందికి వైరస్ నిర్ధారణ అయింది. వారిలో అమ్మాయిలు 228 కాగా అబ్బాయిలకు వైరస్ సోకింది. ఒక్కరోజులోనే 46 మంది చిన్నారులపై మహమ్మారి పంజా విసిరింది.

వైరస్ వ్యాప్తి తగ్గిందనుకొని పెద్దవాళ్లు పని ప్రదేశాల్లో కరోనా జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే చిన్నారులకు వైరస్ సోకుతోందని నిపుణులు అంటున్నారు. పిల్లలు బయట తిరుగుతూ ఆడుకోవడం వల్ల వారికి తెలియకుండానే ఈ మహమ్మారి విపరీతంగా వ్యాపించిందని చెబుతున్నారు. బహరంగ ప్రదేశాలకు పిల్లలను తీసుకెళ్లడం, షాపింగ్ మాల్స్ వంటి వాటికీ తిప్పడం వల్లే కేసుల సంఖ్య పెరుగుతున్నాయని అంటున్నారు. కరోనా నిబంధనలపై చిన్నారులకు అవగాహన ఉండనందున ఇప్పడే బయటకు తీసుకెళ్లడం మానేస్తేనే సరి అని సూచిస్తున్నారు. మరికొన్ని రోజుల పాటు ఇతర చిన్నారులతో కలవనీయకుండా ఇంట్లోనే ఉంచడం ఉత్తమం అని హెచ్చరిస్తున్నారు.

కరోనా తొలి నాళ్లలో వయసు పైబడిన వారిలో విశ్వరూపం చూపించింది. అప్పుడు పెద్దవారు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులపై ఎక్కువ ప్రభావం చూపింది. అప్పుడు పిల్లలకు సోకినా అది లక్షణాలు బయటకు రాలేదు. కానీ రెండో దశలో మాత్రం రూటు మార్చింది. సెకండ్ వేవ్ పిల్లలపై పంజా విసురుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే చాలా మంది పిల్లల్లో వైరస్ గుర్తించినట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. ఈ సారీ కాస్త జాగ్రత్త తప్పనిసరి అంటున్నారు ఆరోగ్యనిపుణులు. మరికొన్నాళ్ల పాటు పిల్లలను ఇంటికే పరిమితం చేయడం మంచిదని చెబుతున్నారు.

కేవలం బెంగుళూరులోనే కాదు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లోనూ పిల్లల్లో వైరస్ కేసులు పెరిగాయి. పెద్దవారిలోనూ బాధితులు లేకపోలేదు. ఇది రెండో దశ అసలు రూపం అని.. నిబంధనలు పాటించకపోతే త్వరలో ఇంకా ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక తల్లిదండ్రులూ పని ప్రదేశాల్లో కొవిడ్ నిబంధనలు గాలికొదిలేయకుండా పాటించాలని హెచ్చరిస్తున్నారు. ఇంకా కొన్నాళ్లు మాస్కులు, భౌతిక దూరం పాటించి కరోనా కట్టడికి సహకరించాలని కోరుతున్నారు.