Begin typing your search above and press return to search.

కరోనా పేషేంట్స్ , ఆస్పత్రులకు ఆ సెక్షన్ మినహాయింపు : కేంద్రం కీలక ప్రకటన !

By:  Tupaki Desk   |   8 May 2021 9:30 AM GMT
కరోనా పేషేంట్స్ , ఆస్పత్రులకు ఆ సెక్షన్ మినహాయింపు : కేంద్రం కీలక ప్రకటన !
X
దేశంలో కరోనా సృష్టిస్తున్న బీభత్సం అంతా ఇంతా కాదు. సెకండ్ వేవ్ తో కరోనా దేశం మొత్తం అస్తవ్యస్తంగా తయారైంది. ప్రపంచంలో ఏ దేశంలో కూడా నమోదు కానీ కేసులు , మరణాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఈ రోజు కూడా మరోసారి నాలుగు లక్షలకి పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రోజురోజుకి కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో భాదితులకు సరైన చికిత్స అందించలేక ఆసుపత్రులు సతమతమౌతున్నాయి. అలాగే దేశంలో ఆక్సిజన్, పడకల కొరతను కూడా తీవ్రంగా ఉంది. ఈ పరిస్థితుల మధ్య కోవిడ్ పేషెంట్ల కోసం ట్రీట్‌మెంట్ చేస్తోన్న ఆసుపత్రుల్లో ఆర్థికపరమైన లావాదేవీలను నిర్వహించడానికి కేంద్రం విధించిన కొన్ని షరతులు, నిబంధనలు అడ్డుగా నిలుస్తున్నాయి.

అదేమిటి అంటే ... రెండు లక్షల వరకు నగదు చెల్లింపులను జరిపే వీలు లేదు. ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 269 ఎస్టీ ప్రకారం ఇది కుదరదు. దీనితో ఒకేసారి రెండు లక్షల రూపాయల బిల్లింగులను కరోనా పేషెంట్ల కుటుంబీకులు చెల్లించలేకపోతోన్నారు. ఈ ఇబ్బందులను నివారించడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 269 ఎస్టీ నుంచి కరోనా చికిత్స చేస్తున్న ఆసుపత్రులకు మినహాయింపు ఇచ్చింది. అయితే, ఇది తాత్కాలికం మాత్రమే అని తెలిపింది. ఈ నెల 31వ తేదీ వరకు ఈ సౌకర్యం అమల్లో ఉంటుంది. కిందటి నెల 1వ తేదీ నుంచి నిర్వహించిన లావాదేవీలన్నింటినీ దీని పరిధిలోకి తీసుకొచ్చింది. ఈ మేరకు ఆదాయపు పన్ను విభాగం ఓ ట్వీట్ చేసింది.

అలాగే, మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే..కరోనా ట్రీట్‌ మెంట్లకు మాత్రమే ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. రెండు లక్షల రూపాయలు లేదా అంతకు మించి నగదు లావాదేవీలను నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. ఫలితంగా నగదు చెల్లింపులను అప్పటికప్పుడు పూర్తి చేసుకుని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కావడానికి సంపూర్ణ వెసలుబాటును కేంద్ర ప్రభుత్వం కరోనా పేషెంట్ల కుటుంబీకులకు కల్పించింది. కరోనా ఆసుపత్రుల్లో రెండు లక్షల నగదు లావాదేవీల పరిమితిని ఎత్తి వేయాలనే డిమాండ్ కొంతకాలంగా వినిపిస్తోంది. దీనిపై ఢిల్లీ హైకోర్టు లోనూ పిటీషన్లు దాఖలయ్యాయి. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్‌ 269 ఎస్‌ టీ ప్రకారం ఒక వ్యక్తి నుంచి రెండు లక్షల రూపాయల కంటే ఎక్కువ నగదును తీసుకోవడానికి వీల్లేదని, దీన్ని తొలగించాలంటూ మనీషా గుప్తా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణలో ఉండగానే కేంద్రం ఆ పరిమితిని ఎత్తేసింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం కరోనా చికిత్స చేసే ఆస్పత్రులకు , కరోనా బాధిత కుటుంబీకులకు కొంచెం రిలీఫ్ అని చెప్పవచ్చు.