Begin typing your search above and press return to search.

కరోనా పంజా.. ఒకే వ్యక్తికి 78 సార్లు పాజిటివ్..!

By:  Tupaki Desk   |   11 Feb 2022 5:22 AM GMT
కరోనా పంజా.. ఒకే వ్యక్తికి 78 సార్లు పాజిటివ్..!
X
కరోనా మహమ్మారి గత రెండేళ్లుగా పంజా విసురుతోంది. గ్యాప్ ఇస్తూ విజృంభిస్తోంది. వేరియంట్ల రూపంలో మారుతూ కోరలు చాస్తోంది. తొలి దశలో సార్స్ కోవ్ -2, తర్వాత ఆల్ఫా, సెకండ్ వేవ్ లో డెల్టా... ఇటీవల ఒమిక్రాన్ పేరుతో గడగడలాడిస్తోంది. తొలుత వైరస్ సోకిన వ్యక్తికి మళ్లీ రాదు అని భావించారు. కానీ ఒక్కసారి కాదు షేర్ ఖాన్ అంటూ... మళ్లీ మళ్లీ సోకుతూనే ఉంది. ఓ వ్యక్తికైతే ఏకంగా 78 సార్లు పాజిటివ్ వచ్చింది. గత 14 నెలలుగా ఆ వ్యక్తి వైరస్ తో బాధపడుతూనే ఉన్నారు.

టర్కీలో నివసించే ముజఫర్ కయాసన్ అనే వ్యక్తికి 2020లో కరోనా సోకింది. ఆ ఏడాదిలోని నవంబర్ లో ఆయనకు పాజిటివ్ అని తేలింది. అప్పుడు కరోనా పీక్స్ ఉన్న సమయం... ఆస్పత్రిలో చేరారు. 14 రోజుల చికిత్స అనంతరం ఇంటికి వెళ్లారు. అయితే స్వల్ప లక్షణాలు ఉండడంతో మళ్లీ కరోనా పరీక్ష చేయించుకున్నారు. మళ్లీ పాజిటివ్ గా తేలింది. మూడో సారి పరీక్ష.. నాలుగోసారి... ఇలా 78 సార్లు వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. అయితే పరీక్షించిన ప్రతీసారి కూడా ఆయకు పాజిటివ్ గానే తేలింది.

ముజఫర్ 14 నెలలుగా కరోనా తో బాధ పడటానికి కారణం ఉందంటున్నారు అక్కడి వైద్యులు. ఆయనకు ల్యూకేమియా వ్యాధి ఉందని... దాని వల్ల వైరస్ నుంచి కోలుకోలేక పోతున్నారు అని తెలిపారు. ఆ వ్యాధితో బాధపడేవారికి రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. అందుకే కరోనా పరీక్షలు నిర్వహించిన ప్రతిసారి కూడా పాజిటివ్ అని తేలుతోంది అంటున్నారు. అయితే స్వల్ప లక్షణాలు, స్వల్ప తీవ్రత ఉన్నందున ఆయన ఇంకా ప్రాణాలతో ఉన్నారని పేర్కొన్నారు.

రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం కారణంగా ముజఫర్ కరోనా నుంచి విముక్తి పొందడం లేదు. అంతేకాకుండా 14 నెలల నుంచి కూడా హోం ఐసోలేషన్ లోనే ఉంటున్నారు. ఇలాంటి కేసులు చాలా అరుదుగా సంభవిస్తాయని వైద్య నిపుణులు అంటున్నారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి.

ఇక భారత్ లోనూ థర్డ్ వేవ్ అంతరించిందని వైద్యారోగ్య శాఖ చెబుతోంది. కేసులు కూడా దిగువకు వస్తున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా మరణించిన వారి సంఖ్య చాలా స్వల్పంగా ఉందని పేర్కొంది. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం గా సాగుతుంది. ప్రపంచ దేశాలన్నీ కూడా టీకా పంపిణీ పై దృష్టి సారించాయి.