Begin typing your search above and press return to search.

వారంలో ఎంత తేడా.. మనకు మహమ్మారి ముప్పు మళ్లీ మొదలైందా?

By:  Tupaki Desk   |   30 Dec 2021 4:52 AM GMT
వారంలో ఎంత తేడా.. మనకు మహమ్మారి ముప్పు మళ్లీ మొదలైందా?
X
కొద్ది రోజులుగా ప్రపంచంలోని పలు దేశాల్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి మన దగ్గరకు మళ్లీ వచ్చేసిందా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. దీనికి తగ్గట్లే.. తాజాగా వెలువడిన గణాంకాలు సైతం తేడా కొట్టేస్తున్నాయి. గడిచిన కొన్ని నెలలుగా లేని కేసుల నమోదు.. గడిచిన రెండు వారాలుగా పరిస్థితుల్లో మార్పులు వచ్చాయన్నట్లుగా ఉంది. మరీ.. ముఖ్యంగా ఈ వారంలో తేడా బాగా ఉంది. ఈ నెల 23న తెలంగాణ రాష్ట్రంలో 177 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. బుధవారం (డిసెంబరు 29) నాడు ఏకంగా 235 కేసులు నమోదు కావటం గమనార్హం.

ఈ కేసుల్లో అత్యధికం జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయి. ఈ నెల 23న జీహెచ్ఎంసీలో 93 కేసులు నమోదు అయితే.. 28న 110 కేసులు.. బుధవారం ఏకంగా 121 కేసులు రికార్డు అయ్యాయి. గడిచిన కొంతకాలంగా తెలంగాణ వ్యాప్తంగా డబుల్ డిజిట్ దాటని పరిస్థితి. ఇక.. హైదరాబాద్ మహానగరం విషయానికి వస్తే.. కేసుల వేళ్ల మీద లెక్కించే స్థాయిలో ఉండేవి. అందుకు భిన్నంగా చాలా నెలల తర్వాత రోజులో నమోదైన కేసులు సెంచరీ దాటేయటం ఈ వారమే జరిగిందని చెబుతున్నారు.

ఇప్పటికే పలువురు నిపుణులు కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతాయన్న వాదనల్ని వినిపించటం తెలిసిందే. కరోనా మూడో వేవ్ ఫిబ్రవరి రెండు.. మూడు వారాల్లో మొదలయ్యే అవకాశం ఉందని చెప్పటం తెలిసిందే. ఇందుకు తగ్గట్లే డిసెంబరు మొదటి వారంతో పోలిస్తే.. చివరి వారంలో కేసుల సంఖ్య ఎక్కువ కావటం ఆందోళన కలిగించే అంశంగా చెప్పక తప్పదు. ఇప్పటివరకు వ్యవహరించిన తీరుతో పోలిస్తే.. ఇకపై మరింత అప్రమత్తంగా ఉండాలన్న విషయం తాజాగా నమోదవుతున్న కేసుల సంఖ్య చెప్పేస్తున్నాయి.

విదేశాల నుంచి వచ్చిన వారితో మొదలైన ఒమిక్రాన్ కేసుల నమోదు కూడా నెమ్మదిగా పెరుగుతోంది. విదేశాల నుంచి వచ్చిన వారిలో పరీక్షలు జరపగా.. బుధవారం ఒక్క రోజులోనే పది మందికి సాధారణ కరోనా కన్ఫర్మ్ అయితే.. జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపిన శాంపిళ్లలో 23 కేసులు ఉన్నాయి. వీటికి సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉంది.

ఇప్పటివరకు తెలంగాణ వ్యాప్తంగా 62 మందికి ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా.. అందులో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 18కి చేరుకున్నట్లు చెబుతున్నారు. ఒమిక్రాన్ ముప్పున్న దేశాల నుంచి ఇప్పటివరకు 12,267 మంది ప్రయాణికులు హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు వచ్చినట్లుగా చెబుతున్నారు. ఏమైనా.. కరోనా కేసుల పెరుగుదల ఎక్కువ అవుతున్న వేళ.. మరింత అప్రమత్తంగా ఉండాల్సిన టైం వచ్చేసిందని చెప్పక తప్పదు.