Begin typing your search above and press return to search.

గురుకులంలో కరోనా కలకలం...43 మంది విద్యార్థులకు పాజిటివ్

By:  Tupaki Desk   |   29 Nov 2021 11:10 AM GMT
గురుకులంలో  కరోనా కలకలం...43 మంది విద్యార్థులకు పాజిటివ్
X
కరోనా వైరస్ మహమ్మారి సెకండ్ వేవ్ అనంతరం పాఠశాలలు తెరుచుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కరోనా విద్యార్థులను వెంటాడుతోంది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉన్న పాఠశాలల్లోని విద్యార్థులు ఇప్పటికే కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సంగారెడ్డి జిల్లా పటాన్‌చెర్వు మండలం ముత్తంగిలో కరోనా కలకలం రేపింది. ముత్తంగి గురుకుల పాఠశాలలోని 42 మంది విద్యార్థులు, ఉపాధ్యాయురాలు తాజాగా కరోనా బారినపడ్డారు. గురుకుల పాఠశాలలో 491 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తుండగా, 27 మంది సిబ్బంది ఉన్నారు.

నిన్న 261 మంది విద్యార్థులు, 27 మంది సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించగా,మొత్తం 43 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. దీంతో కరోనా మహమ్మారి సోకిన వారిని పాఠశాలలోనే ఐసోలేషన్ లో ఉంచారు అధికారులు. ప్రస్తుతం, కరోనా సోకిన ఆ విద్యార్థులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మిగతా విద్యార్ధులు, ఉపాధ్యాయులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.మూడు రోజుల క్రితం ఓ విద్యార్థిని అస్వస్థతకు గురి కావడంతో వైద్య పరీక్షలు నిర్వహించారు. కాగా.. కరోనా సోకిన విద్యార్థుల పరిస్థితి బాగానే ఉందని అధికారులు తెలిపారు. అయితే.. ముత్తంగి గురుకుల పాఠశాలలో పలువురు విద్యార్థులకు కరోనా సోకడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

ఇటీవలె ఖమ్మం జిల్లా లోని వైరా గురుకుల పాఠశాల లో 27 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. అదే విధంగా హైదరాబాద్ బహదూర్‌ పల్లిలోని టెక్‌ మహీంద్ర వర్సిటీ లో 25 మంది విద్యార్థులు, ఐదుగురి సిబ్బంది కొవిడ్ బారిన పడ్డారు. దీంతో వర్సిటీకి 15 రోజుల సెలవు ప్రకటించారు.