Begin typing your search above and press return to search.

బ్రిటన్ యువరాజు చార్లెస్‌ కు కరోనా పాజిటివ్

By:  Tupaki Desk   |   25 March 2020 1:59 PM GMT
బ్రిటన్ యువరాజు చార్లెస్‌ కు కరోనా పాజిటివ్
X
కరోనా వైరస్‌ కు వారూవీరూ అన్నతేడా లేదు. దేశాధినేతలు - దేశాధినేతల ముద్దుల భార్యలను కూడా సోకిన ఈ వైరస్ ఇప్పుడు రాజులనూ విడిచిపెట్టడం లేదు. తాజాగా బ్రిటన్ యువరాజు చార్లెస్‌ కు కరోనా వైరస్ సోకింది. ఆయనకు కరోనా పాజిటివ్ తేలినట్లు క్లారెన్స్ హౌస్ ధ్రువీకరించింది.

71 ఏళ్ల ప్రిన్స్ చార్లెస్‌ లో స్వల్పంగా కరోనావైరస్ లక్షణాలు కనిపించాయని, అయితే.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని ఆయన అధికార ప్రతినిధి తెలిపారు. ప్రిన్స్ చార్లెస్ భార్య 72 ఏళ్ళ డచెస్ ఆఫ్ కార్న్‌వాల్‌ కామిలాకు కూడా పరీక్షలు నిర్వహించారు. అయితే, ఆమెకు వైరస్ లక్షణాలు ఏమీ లేవని తేలింది. కాగా చార్లెస్ తల్లి బ్రిటన్ రాణి ఆయన్ను మార్చి 12న చివరిసారిగా కలిశారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉందని బకింగ్‌ హామ్ ప్యాలెస్ తెలిపింది.

కాగా.. క్లారెన్స్‌ హౌస్ ఒక ప్రకటన విడుదల చేస్తూ, "ఆబర్డీన్‌ షైర్‌ లోని ఎన్‌ హెచ్ ఎస్ వారికి వైద్య పరీక్షలు నిర్వహించింది" అని తెలిపింది. చార్లెస్, కామిలా ఇద్దరూ స్కాట్లండ్‌ లోని బాల్మోరల్‌ లో స్వీయ నిర్బంధంలో ఉన్నారని, యువరాజుకు ఎవరి నుంచి వైరస్ సోకి ఉంటుందన్నది చెప్పలేమని క్లారెన్స్ హౌస్ తెలిపింది. కాగా యూరప్ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ తీవ్రంగా ఉంది. బ్రిటన్‌ లోనూ దీని ప్రభావం ఎక్కువగా ఉంది. ఇప్పుడు యువరాజు చార్లెస్‌ కు వైరస్ సోకినట్లు నిర్ధారణ కావడం సంచలనంగా మారింది.